టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. AI భద్రతపై డేరియోతో ఏకమైన వరల్డ్ టెక్ దిగ్గజాలు

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. AI భద్రతపై డేరియోతో ఏకమైన వరల్డ్ టెక్ దిగ్గజాలు

వాషింగ్టన్: టెక్ ప్రపంచంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) కొత్త పుంతలు తొక్కతోన్న వేళ ప్రపంచ టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధి వేగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని అభిప్రాయపడ్డారు. లేదంటే ఏఐతో మానవాళికి ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అభివృద్ధి వేగంపై ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ సీఈఓ డేరియో అమొడెయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వీలుగా ఏఐ సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. ఏఐ వేగంపై భద్రతా చర్యలు తీసుకోకపోతే రాబోయే 6 నుంచి 12 నెలల్లో ఇంటర్నెట్‌ను సైతం ఏఐ తన ఆధీనంలోకి తీసుకోగలదని హెచ్చరించారు.

ఏఐతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం దాని అభివృద్ధి వేగం ప్రమాదాలను అంచనా వేసి, నియంత్రించే మన సామర్థ్యాన్ని మించిపోయిందని పేర్కొన్నారు. తమ కంపెనీ భద్రతా పద్ధతులను ధ్రువీకరించుకోవడానికి స్వతంత్ర థర్డ్-పార్టీ నిపుణులకు ఉద్యోగుల తరహా యాక్సెస్ కల్పిస్తామని డేరియో ప్రకటించారు. అంటే.. అత్యంత అధునాతన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న సంస్థల భద్రతా విధానాలను బయటివారు స్వతంత్రంగా పరిశీలించే అవకాశం కల్పించాలన్నది ఈ ప్రతిపాదనలో కీలక అంశం.

ఏఐ అభివృద్ధి వేగానికి కళ్లెం వేయాలన్న డేరియో అమొడెయ్ వాదనను ఓపెన్‎ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‎మన్ సమర్థించారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించాలన్న డేరియో వాదనతో తాను ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు. ఇదే అంశంపై గత కొన్నివారాలుగా మేం కూడా చర్చిస్తున్నామని తెలిపారు. ఏఐ స్వతంత్ర నిపుణులకు ఉద్యోగుల తరహా యాక్సెస్ ఇవ్వాలనే ఆలోచన అద్భుతమైనదని కొనియాడారు.

డేరియా ప్రతిపాదనపై ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల అధినేత ఎలన్ మస్క్ సైతం స్పందించారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని డేరియో చెప్పింది నిజమని పేర్కొన్నారు. ముందుగా ఏఐ భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసి ఆ తర్వాత అత్యంత శక్తిమంతమైన మోడళ్ల అభివృద్ధిని కొనసాగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చనేది ఈ ముగ్గురి అభిప్రాయం. ఏఐ మోడళ్ల అభివృద్ధిపై తీవ్రంగా పోటీ పడుతున్న ఈ ముగ్గురు కీలక నాయకులు భద్రత విషయంలో ఒకే స్టాండ్ తీసుకోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.