తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 2026 సెప్టెంబర్ 12 నుంచి రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు (సెప్టెంబర్ 12) పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఒకటి దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంనట్లు పేర్కొంది. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు . ఇప్పటికే ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చిర్యాలలోని కన్నెపల్లిలో అతిభారీ వర్షపాతం 13 సెంటీమీటర్లు నమోదయింది. అదే విధంగా వరంగల్, కొమరం భీమ్, మహబూబాబాద్ మంచిర్యాల్ లోని పలు ప్రాంతాల్లో 7 నుండి 9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
ఉత్తర, తూర్పు ఈశాన్య జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉత్తర ఈశాన్య తెలంగాణలోని మిగిలిన జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని సూచించింది. అతి భారీ వర్షాలతో 6 జిల్లాలకు ఆరెంజ్, భారీ వర్షాలతో 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈరోజు (సెప్టెంబర్ 12) భారీ నుంచి అతి భారీ వర్షాలు: ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఈరోజు భారీ వర్షాలు : నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశంతో ఎల్లో అలెర్ట్ జారి
రేపు (సెప్టెంబర్ 13) భారీ వర్షాలు: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు ఉరుములు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్ర కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
