హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పడిపోయి, వాతావరణంలో తేమ పెరగడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. దోమలు, కలుషిత నీరు, గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) డాక్టర్ రవీందర్ నాయక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు.
నీరు నిలువకుండా చూసుకోండి...
వర్షాల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా పొంచి ఉన్నందున కిటికీలు, తలుపులకు మెష్‌లు అమర్చుకోవాలని, దోమ తెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలని డీపీహెచ్ రవీందర్ నాయక్ సూచించారు. డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, సెప్టిక్ ట్యాంకులపై దోమలు చేరకుండా జాలీలు కట్టాలని తెలిపారు.
నీటి నిల్వలను తొలగించేందుకు ప్రతి వారం తప్పనిసరిగా ఫ్రైడే–డ్రై డే పాటించాలని పిలుపునిచ్చారు. కామెర్లు, టైఫాయిడ్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కాచి చల్లార్చిన, ఫిల్టర్ చేసిన నీటినే తాగాలని, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, బయటి నిల్వ ఆహారాన్ని తినవద్దని స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ దవాఖానను ఆశ్రయించాలని సూచించారు.
