బిర్యానీ అంటే హైదరాబాద్.. కానీ తెలంగాణ రుచుల లిస్ట్ చాలా పెద్దది..! సర్వపిండి నుంచి సంగటి దాకా.. పచ్చిపులుసు నుంచి గుత్తి వంకాయదాకా.. పల్లె వంటల ఘుమఘుమలు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఫుడ్ ఫెస్టివల్స్ రూపంలో సందడి చేస్తున్నాయి. జిల్లాకో రుచి.. ప్రాంతానికో ప్రత్యేక వంటకం.. అన్నీ ఒకే చోట కొలువుదీరితే.. ఫుడ్ లవర్స్‌కు పండగే పండగ!
హైదరాబాద్‌లో ఫుడ్ ఫెస్టివల్స్ సందడి పెరుగుతోంది. ఒకేచోట తెలంగాణ రుచుల జాతర నిర్వహిస్తే.. అది ఫుడ్ లవర్స్‌కే కాదు, మన సంస్కృతికి కూడా ఓ కొత్త గుర్తింపు అవుతుంది. తెలంగాణ టూరిజం పాలసీ 2025–30లో కుషన్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, హలీం, తెలంగాణ వంటకాలను ప్రోత్సహించే ఫుడ్ ఫెస్టివల్స్ క్యాలెండర్ రూపొందించారు. జిల్లాల వారీగా సంప్రదాయ స్వీట్లు, పిండి వంటలు, గ్రామీణ మహిళల వంటకాల స్టాల్స్, లైవ్ కుకింగ్ డెమోలు, మట్టి పాత్రల్లో వంటలు, చిరుధాన్యాలు, స్థానిక పంటలతో వంటకాలు ఫుడ్ లవర్స్‌ను చవులూరుస్తున్నాయి.
పుష్ప ఫుడ్ ఫెస్టివల్
తెలంగాణ వంటకాలపై ప్రత్యేకంగా పుష్ప ఫుడ్ ఫెస్టివల్ మొయినాబాద్‌లో సెప్టెంబర్ 11–13 వరకు ది గ్రీన్‌ఫీల్డ్స్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్‌లో జరుగుతోంది. సంప్రదాయ థాలీ, లైవ్ తవా కౌంటర్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. కళ్ల ముందే వేడివేడిగా కాల్చి ఇచ్చే లైవ్ తవా వంటకాల రుచిని ఆస్వాదించొచ్చు. భోజన ప్రియుల కోసం సంప్రదాయ థాలీ భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మాన్‌సూన్ ఫుడ్ ఫెస్టివల్
జూబ్లీహిల్స్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, నెక్సస్ మాల్, కొత్తపేట బ్రాంచ్‌లలో కృష్ణపట్నం కిచెన్‌లో ది గ్రేట్ మాన్‌సూన్ ఫుడ్ ఫెస్టివల్ 2026 ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్లో నెల్లూరు కారం వింగ్స్, మటన్ పెప్పర్ రోస్ట్, మాన్‌సూన్ కోడి పులావ్, చింతచిగురు పులిహోర వంటి ఘాటైన దక్షిణ భారత వంటకాలు లభిస్తాయి.
లోకల్ రుచులు..
పీబీఈఎల్ సిటీ ఫెస్టివ్ ఫుడ్ కార్నివాల్ సెప్టెంబర్13 – సెప్టెంబర్ 23 తేదీల్లో పీరంచెరువు పీబీఈఎల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో10 రోజులపాటు స్థానిక హోమ్ చెఫ్‌లు, క్లౌడ్ కిచెన్‌ల ద్వారా హోమ్‌మేడ్ వంటకాల ప్రదర్శన ఉంటుంది. సౌత్ ఇండియా గ్రేటెస్ట్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అక్టోబర్ నెలలో నిర్వహించనున్నారు. కరీంనగర్లో నూర్ కార్నివాల్ -హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ సెప్టెంబర్13న ఎస్ ఎఫ్ ఎస్ గార్డెన్ లో నిర్వహించనున్నారు. ఒకే వేదికపై రకరకాల షాపింగ్ స్టాల్స్‌తోపాటు స్థానిక, ప్రాంతీయ వంటకాలు ఉంటాయి. గచ్చిబౌలి స్టేడియంలో ‘గ్రాండ్ ఫుడ్ ఫెస్ట్ 2026’ అక్టోబర్ 9 నుంచి11 వరకు జరగనుంది.
నిజాం వంటకాల రుచులు
నిజాం వంటకాల రుచులను అందించే నిజామి ఫుడ్ ఫెస్టివల్స్ ఈ ఏడాది వేర్వేరు సమయాల్లో పలు ప్రముఖ హోటళ్లలో నిర్వహిస్తున్నారు. బేగంపేటలో జరిగిన ఈ వేడుకను ది ప్లాజా హోటల్ నిజామి ఫుడ్ ఫెస్టివల్‌ను తెలంగాణ పర్యాటక శాఖ, బేగంపేటలోని ది ప్లాజా హోటల్ సంయుక్తంగా ఈ రాయల్ బఫేను నిర్వహించాయి. ఈ ఫెస్టివల్లో అన్‌లిమిటెడ్ బఫే లో మటన్ మరగ్, పత్తర్ కా గోష్, మటన్ హలీమ్, జఫ్రానీ చికెన్ బిర్యానీ, ఖుబానీ కా మీఠా, షీర్ కుర్మా వంటి 35కు పైగా ప్రామాణిక నిజాం వంటకాలు వడ్డించారు.
రెడ్ రోజ్ ప్యాలెస్‌లో దావత్- ఎ- దస్తర్ ఖాన్ పేరిట సెప్టెంబర్ నెలలో నవాబీ శైలి భోజనాన్ని ఇష్టపడే వారికోసం ప్రత్యేకంగా వన్-డే ఈవెంట్ ఏర్పాటుచేశారు. ఇందులో అన్‌లిమిటెడ్ హైదరాబాద్ షాదీ కా ఖానాతోపాటు సూఫీ ఖవ్వాలి, లైవ్ మెహందీ, కాలిగ్రఫీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్‌లో నిజాం ప్రత్యేక వంటకాలైన హలీమ్, నిహారీ, లుఖ్మీలతో ఈ ఫెస్టివల్ జరిగింది. హయత్ ప్లేస్ హైదరాబాద్‌లో నిజామి ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించారు. వరంగల్ భద్రకాళి చెరువు పరిసరాల్లో కాకతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక తెలంగాణ డిషెస్‌తో జిల్లా స్థాయి ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించారు.
తెలంగాణ పిండివంటలు
తెలంగాణ వంటకాలు వాటి ప్రత్యేకమైన కారం, రుచి, పులుపుకు ప్రసిద్ధి చెందాయి. బగారా బిర్యానీ, గోంగూర చికెన్, బగారా రైస్ విత్ చికెన్, ఫిష్, మటన్, చికెన్, ఫ్రాన్స్ బిర్యానీ, తలకాయ కూర, ఉప్పుడు పిండి, నూకతో చేసే సంప్రదాయ వంటకం. చింతపండు పులుసుతో చేసే నాటుకోడి కూర, మసాలాలు దట్టించి వేయించిన చికెన్ కర్రీ, హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, మాంసాహార వంటకాలు, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, పప్పు లేదా కారంతో తినే చిరుధాన్యాల రొట్టెలను ఇష్టపడుతున్నారు.
ఈ రుచులను తెలంగాణ ఇంటి రుచులు, మిస్టర్ తెలంగాణ రుచులు, తెలుగింటి రుచులు, తెలంగాణ నాటు రుచులు పేర్లతో నగరం నలుమూలలా రెస్టారెంట్లు అందిస్తున్నాయి. సంక్రాంతికి సకినాలు, కారప్పూస లాంటి తెలంగాణ పిండి వంటలు శ్రీ స్వగృహ ఫుడ్, తెలంగాణ పిండి వంటలు వంటి విక్రయ కేంద్రాల్లో లభిస్తున్నాయి.
