లీటరు పెట్రోల్ రూ.376.. జస్ట్ 5 రోజుల్లో రూ.30 పెంచేసిన పాకిస్థాన్

లీటరు పెట్రోల్ రూ.376.. జస్ట్ 5 రోజుల్లో రూ.30 పెంచేసిన పాకిస్థాన్

పాకిస్థాన్‌లో ఇంధన ధరలు అక్కడి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముడి చమురు ధరల అస్థిరత, సరికొత్త పెట్రోలియం ధరల విధానం కారణంగా ఆ దేశంలో పెట్రోల్ డీజిల్ ఝరలు భగ్గుమంటున్నాయి. కేవలం 5 రోజుల వ్యవధిలో 5 సార్లు ధరలు పెంచడంతో పాక్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంధన మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలతో నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.

పెట్రోల్ ధరల విలవిల..
పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. కేవలం 5 రోజుల్లో జరిగిన వరుస పెరుగుదల కారణంగా లీటరు పెట్రోల్ పై ఏకంగా 29.95 పాకిస్థానీ రూపాయలు రేటు పెరిగింది. తాజా పెంపులతో లీటరు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 375.82 పాకిస్థానీ రూపాయలకు చేరింది. చివరి సారిగా ఒక్కరోజే పెట్రోల్ పై 5.02 పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోజువారీ ప్రయాణాలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.

డీజిల్ ధరల పరుగులు..
మరోవైపు డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. 5 రోజుల సమీక్షా కాలంలో డీజిల్ ధరలు లీటరుకు 25.27 పాకిస్థానీ రూపాయలు పెరిగాయి. తాజాగా ఒక్కరోజే డీజిల్ పై 5.28 అదనంగా భారం పడటంతో.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో లీటరు డీజిల్ ధర 403.32 పాకిస్థానీ రూపాయ వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. రవాణా రంగం పూర్తిగా డీజిల్‌పై ఆధారపడి ఉండటంతో.. ఈ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రకాల వస్తువులపై పడుతోంది.

ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయంగా మారుతున్న అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ ధరలను సవరిస్తున్నారు. అయితే ఈ తాజా ధరలు కేవలం 3 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటాయని.. ఆ తర్వాత మరోసారి నియంత్రణ సంస్థ సమీక్ష నిర్వహించనుండటం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరుగుతాయో లేక తగ్గుతాయో తెలియక పాకిస్థాన్ ప్రజలు రేట్లను చూసి షాక్ అవుతున్నారు.