మన కృష్ణా నీళ్లు ఆంధ్రార్పణం!..జల దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది..!!

మన కృష్ణా నీళ్లు ఆంధ్రార్పణం!..జల దోపిడీ ఇంకా  కొనసాగుతూనే ఉంది..!!
  • మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా.. కన్నీటి గానమా..
  • పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా..
  • ఇది తెలంగాణ ఉద్యమంలో 
  • నీటి దోపిడీపై గద్దరన్న గర్జించిన పాట..! 
  • తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది కానీ.. ఏపీ జల దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది..!!
  • నదినే మలుపుకుంటున్న పొరుగు రాష్ట్రం
  • తెలంగాణ ఏర్పడ్డాకనే ఎక్కువ అన్యాయం
  • ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏండ్లలో ఏపీకి తరలింది 891 టీఎంసీలు
  • తెలంగాణ ఏర్పడ్డాక 12 ఏండ్లలో ఏపీ తోడుకున్నది 1,282 టీఎంసీలు
  • పోతిరెడ్డిపాడు గేట్ డ్యామేజ్ పేరిట కొత్త డ్రామా
  • శ్రీశైలం ఖాళీ చేస్తే హైదరాబాద్​కు తాగు నీరు కష్టమే

హైదరాబాద్, వెలుగు: నీళ్లు , నిధులు, నియామకాలు ఇది తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్.. అందులో మొట్టమొదటిది నీళ్లు.. ఆ నీళ్లే మనవి కాకుండా పోయాయి. మొదటి డిమాండు నెరవేరకపోగా.. ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే ఎక్కువ అన్యాయం జరిగింది. అప్పుడు నీళ్లని గొంతెత్తిన వాళ్లు అధికారంలోకి వచ్చాక ఆంధ్రాకు గేట్లు ఖుల్లా చేసేశారు. పాలమూరు పాడి పంటలను తడపాల్సిన కృష్ణమ్మను బిరబిరా తరలిపోతుంటే మన పాలకులు చోద్యం చూస్తున్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 1997 నుంచి 2014 వరకు అంటే 17 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏపీకి 891 టీఎంసీల నీళ్లు తరలిపోయాయి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 12 ఏండ్ల వ్యవధిలో ఇదే పోతిరెడ్డి పాడు నుంచి 1,281.72 టీఎంసీల నీరు తరలిపోయింది.  

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన నీళ్లెటుపోయాయి? ఎందుకు ఇలా జరిగింది? దీనికి కారకులు ఎవరు? ఏపీకి మనమే బంగారుపళ్లెంలో పెట్టి కృష్ణా నీటిని అందిస్తున్నామా? ఇది సగటు తెలంగాణ వాది ప్రశ్న. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​లో మొత్తంగా 11 గేట్లు ఉండగా.. 1988లో నాలుగు ఏర్పాటు చేసి రోజూ 11,500 క్యూసెక్కులు తరలించేవాళ్లు. ఆ తర్వాత 2005లో మరో 7 గేట్లు ఏర్పాటు చేసి 44,500 క్యూసెక్కులు మళ్లించేలా ఆధునికీకరించారు. అయితే, 2020లో మాత్రం అది మరింత పీక్స్​కు చేరింది. 

పోతిరెడ్డి పాడుకు ఉన్న 9, 10, 11వ నెంబర్​ గేట్లను ఏపీ ఎక్కువగా ఆపరేట్​ చేయదు. కారణం ఏమిటంటే 880 అడుగుల నీరుంటేనే వీటిని తెరవాలన్నది నిబంధన. కానీ ప్రస్తుతం 865 అడుగుల నీరు( 123.32 టీఎంసీలు) మాత్రమే ఉంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం 9వ నంబర్ గేటును ఎందుకు తెరిచిందన్నది చర్చనీయాంశంగా మారింది. దానిని రిపేరు చేసేందుకు ప్రయత్నిస్తుండగా గేటు కొట్టుకుపోయిందని ఏపీ అధికారులు చెబుతున్నారు. 

దిగువకు నీటిని తరలించుకునేందుకు ఏపీకొత్త డ్రామాకు తెరలేపిందన్నది స్పష్టంగా అందరికీ అర్థమవుతోంది. చివరి సారిగా 2023లో చివరిసారిగా ఏపీ ఆ మూడు గేట్లను ఓపెన్ చేసింది. ఆ ఏడాది వరద బాగా రావడం.. ప్రాజెక్టులు నిండడంతో ఆ గేట్ల ద్వారా నీటిని తరలించింది. ఎల్​నినో కారణంగా వర్షాలు లేక ఇప్పుడు ప్రాజెక్టులోకి వరదే రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి వరద శ్రీశైలం వరకే పరిమితమైంది. కనీసం 200 టీఎంసీల మార్క్​నూ వరద చేరలేదు. 

మరోవైపు మెయింటెనెన్స్​ అని చెప్తున్నా.. ఏ ప్రాజెక్టుకైనా లేదా హెడ్​రెగ్యులేటర్లకైనా వర్షాకాలం ప్రారంభానికి ముందు, సీజన్​ పూర్తయ్యాకే చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం ఇప్పుడెందుకు మెయింటెనెన్స్​ అంటూ బుకాయిస్తున్నారనేది ఎదురవుతున్న ప్రశ్న. ఎత్తాల్సిన అవసరమేలేని 9వ నెంబర్​ గేట్​ను ఎందుకు ముట్టుకున్నదన్న చర్చ నడుస్తున్నది. ఒక్కోగేటును ఎత్తేందుకు రెండువైపులా రోప్స్​ను ఏర్పాటు చేస్తారు. ఆ రోప్స్​ను మోటార్​ ద్వారా పైకి లేపుతారు.

 కానీ, 9వ గేట్​ను ఎత్తే క్రమంలో ఒకవైపు రోప్​ తెగిపోయింది. ఎక్కువ నీళ్లున్నప్పుడు వాడే గేట్​ను ఇప్పుడు ఎందుకు ఎత్తారు? గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాదం జరిగితే రాత్రి వరకు ఎందుకు దాచారు? తీరా తెల్లారక వచ్చి ఏం తెలియనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

నదినే మలుపుకొంటున్న ఏపీ

పెన్నా బేసిన్​లో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్లలో ఇప్పటికే వంద టీఎంసీలకుపైగా నీటిని ఏపీ నిల్వ చేసుకున్నది. అయినా  తాగునీటి పేరుతో శ్రీశైలం జలాలను మరో 40 టీఎంసీలకు వరకు తరలించుకుపోయింది. ఇటీవల కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు త్రీమెంబర్​ కమిటీ మీ రెండు సార్లు టింగ్​ నిర్వహించింది. ఆ రెండు మీటింగ్​లూ ఎటూ తేలకుండానే ముగిశాయి. దీంతో మీటింగ్​లతో ఒరిగేది ఏమీ ఉండదన్న దురుద్దేశంతోనే నదిని మలుపుకునేందుకు ఏపీ కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 

మామూలుగా పోతిరెడ్డిపాడు అంటేనే అదొక చిన్నపాటి నదీ వ్యవస్థ అనేది కాదనలేని సత్యం. ప్రస్తుతం గేట్​ డ్యామేజ్​ కావడంతో పోతిరెడ్డిపాడు నుంచి ప్రవాహాలు మరింత ఉరకలెత్తుతున్నాయి. ఇప్పటికే నాలుగు గేట్ల ద్వారా రోజూ 8 వేల క్యూసెక్కుల నీళ్లను మళ్లిస్తున్న పొరుగు రాష్ట్రం.. ఈ గేట్​ డ్యామేజ్​ ద్వారా మరింత నీటిని మలుపుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. తెగిపోయిన రోప్​కు రిపేర్లు చేసేందుకు కూడా పది నుంచి 15 రోజుల వరకు సమయం పడుతుందని ఏపీ అధికారులు చెబుతున్నారు. 

150 మీటర్ల రోప్​ అవసరమవుతుందంటున్నారు. అంటే ఈ పది పదిహేను రోజుల్లో మరో 10 నుంచి 15 టీఎంసీల వరకు నీళ్లు ఏపీకి తరలిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో ఏపీ తొందరగా రిపేర్లు చేస్తుందన్న నమ్మకం లేదంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ఇదే జరిగితే ఏపీ రిజర్వాయర్లలోకి శ్రీశైలం నీళ్లన్నీ వెళ్లిపోతాయి. మనం తాగునీటికీ తల్లడిల్లాల్సిన పరిస్థితి ఉంటుంది. 

పట్నంలో పానీ పరేషాన్ తప్పదా?

ఏపీ ఇలాగే కుట్రపూరితంగా నీటిని తరలిస్తే మాత్రం గొంతెండుకుపోయేది తెలంగాణకేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన తాగు నీటి అవసరాలు తీర్చుకునేందుకు కల్వకుర్తి లిఫ్ట్​ ద్వారా రోజూ 2500 క్యూసెక్కుల నీళ్లు తీసుకుంటున్నం. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు కింద అవసరాలు, హైదరాబాద్​ తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేసుకుంటున్నాం. 

మనకు శ్రీశైలం నుంచి తీసుకునే సోర్స్​ లేదు. అందుకే సాగర్​లోకి మళ్లించి అక్కడి నుంచి తీసుకుంటున్నా మని ఇప్పటికే కేంద్రానికి మన ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా సాగర్​కు తీసుకుపోతున్న నీళ్లలోనూ కుడి కాల్వ ద్వారా నీటిని ఏపీ మళ్లించుకోవడం గమనార్హం. మనం ఏఎమ్మార్పీ, ఎస్​ఎల్​బీసీ ద్వారా రోజూ 2000 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్​కు పంపింగ్​ చేయడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలో 7 వేల క్యూసెక్కుల ను తీసుకుంటున్నం. ఇప్పుడు మన అవసరాలు తీరాలంటే ఏపీని కచ్చితంగా నిలువరించాల్సిన అవసరం ఉంటుంది.  ఏపీకి ఉన్న వాటా మొత్తం పూర్తయిందని, ఉన్న నీళ్లన్నీ తమవేనని ఇప్పటికే కృష్ణా బోర్డు త్రీమెంబర్​ కమిటీ మీటింగ్​లో మన ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

నెల రోజుల్లో 60 టీఎంసీలు ఖాళీ..

శ్రీశైలం ప్రాజెక్టులో గత నెల 12 నాటికి 185 టీఎంసీల నిల్వ ఉండేది. కానీ, తాజాగా నీటి నిల్వ 123 టీఎంసీలకు పడిపోయింది. అంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు 60 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులో ఖాళీ అయ్యాయి. అందులో ఏపీ వాటానే దాదాపు 40 టీఎంసీలు కావడం గమనార్హం. మనం విద్యుదుత్పత్తి ద్వారా సాగర్​కు తీసుకుపోయిన నీళ్లలోనూ ఏపీ తన వంతు కబ్జా పెట్టేయడం ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుగానూ 865 అడుగుల వద్ద నీళ్లున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి 854  అడుగుల వరకు నీటిని తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ గేట్​ డ్రామాతో ఆ స్థాయికి వచ్చే వరకు నీటిన మళ్లించాలనే కుట్రలకు ఏపీ తెరలేపిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.