ఒక్క సర్కారు బడీ మూసేయం..ప్రతి మూడు కిలోమీటర్లకో ప్రైమరీ స్కూల్

ఒక్క సర్కారు బడీ మూసేయం..ప్రతి మూడు కిలోమీటర్లకో ప్రైమరీ స్కూల్
  • పదివేల జనాభాకో తెలంగాణ పబ్లిక్ స్కూల్
  • మూడంచెల విద్యావిధానం అమల్లోకి తెస్తం
  • ప్రైమరీ స్థాయిలోనే జర్మన్, జపనీస్ భాషలు
  • రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్
  • జెన్ ఆల్ఫా, జెన్ బీటా లక్ష్యంగా సిలబస్  
  • పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరించం
  • అర్హత ఉన్న కాలేజీలకు బకాయిలు చెల్లిస్తం
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • విద్యకు 15% బడ్జెట్ కేటాయించడమే లక్ష్యం
  • 1,603 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తం

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ మూసివేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రతి 10 వేల జనాభాకు కార్పొరేట్ ప్రమాణాలతో కూడిన ఒక ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌‌లో విద్యారంగానికి నిధుల కేటాయింపులను 15 శాతానికి పెంచడమే ప్రభుత్వ ప్రధాన విధానమని స్పష్టం చేశారు. 

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద బిడ్డల కోసం ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, 10 కిలోమీటర్లకు హైస్కూళ్లను  కొనసాగిస్తామని సభకు హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని చెప్పారు.

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక విద్యా ప్రమాణాలను పెంచేందుకే జీవో ఎంఎస్ 97 తెచ్చామని, విద్యార్థుల అపోహలను తొలగించేందుకు అవసరమైతే జీవోలో సవరణలు చేస్తామని సీఎం తెలిపారు. జెన్ జీతో పాటు జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరానికి కూడా దృష్టిలో ఉంచుకొని విద్యా విధానం తీసుకొస్తున్నాం అని చెప్పారు. ‘‘దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. తలరాతలు మార్చేది విద్య అని నమ్మి విద్యా శాఖ నా దగ్గర పెట్టుకున్నా.. నాకు విద్యాశాఖ‌‌పై ఒక ప్యాష‌‌న్ ఉంది. 

ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్‌‌ను తీసుకొస్తున్నాం” అని తెలిపారు. అసెంబ్లీలో విద్యపై స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం రేవంత్‌‌రెడ్డి మాట్లాడారు. స్కిల్స్ వర్సిటీకి ఏఐసీటీఈ గుర్తింపును తెస్తామని ప్రకటించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో నర్సరీ, ఎల్‌‌కేజీ, యూకేజీ (ప్రీ–ప్రైమరీ) తరగతులను ప్రారంభించి.. 64 వేల మందికి విద్యాబోధన చేయడమే కాకుండా, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతోపాటు టీచర్లకూ నాణ్యమైన పౌష్టికాహార బ్రేక్‌‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. 

దేశ చరిత్రలోనే తొలిసారిగా 500 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఖర్చుతోనే జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్‌‌లాంటి దేశాలకు శిక్షణకు పంపిస్తున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌‌ల తరహాలో ఉపాధ్యాయులకూ ఏడాదిపాటు వేతనంతో కూడిన ‘స్టడీ లీవ్’ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాల పరిశీలనకు ఎమ్మెల్యేలందరినీ చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల స్టడీ టూర్‌‌కు పంపుతామని చెప్పారు.  

త్వరలోనే హార్వర్డ్, లండన్, నార్త్‌‌ఈస్టర్న్, వర్జీనియా టెక్ వర్సిటీల క్యాంపస్‌‌లు హైదరాబాద్‌‌కు రానున్నాయని, వర్సిటీల్లో 1,603 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు.  

స్కిల్స్‌‌ వర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్‌‌ విద్య

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, ఈవీ రంగాల్లో సాంకేతిక నైపుణ్యం కల్పించేందుకే పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి అనుసంధానిస్తున్నామని, కళాశాలల హోదా మారదని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. 1956 నాటి పాత ఐటీఐలను రూ. 46 కోట్ల చొప్పున టాటా భాగస్వామ్యంతో అత్యాధునిక ఏటీసీలుగా మార్చి.. స్టూడెంట్లకు నెలకు రూ. 2 వేల స్టైపెండ్ అందిస్తున్నామని తెలిపారు.

 తెలంగాణ మోడల్‌‌ను కేంద్ర ప్రభుత్వమే స్వీకరించి దేశవ్యాప్తంగా ‘పీఎం సేతు’ పథకం పేరిట అమలు చేస్తూ రాష్ట్రానికి 4 క్లస్టర్లను కేటాయించిందన్నారు. ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నప్పటికీ నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారని, అందుకే ఆనంద్ మహీంద్రా, అపోలో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌‌లాంటి దిగ్గజాలతో కూడిన బోర్డుతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దామని, శిక్షణ పొందిన వారికి ఆయా పరిశ్రమల్లోనే ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. 

నర్సింగ్, ఇతర గ్రాడ్యుయేట్లకు జర్మన్, జపనీస్, కొరియన్‌‌లాంటి విదేశీ భాషలను స్థానిక నిపుణులతో నేర్పిస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ 1921–1931 మధ్య నడిపిన పత్రిక స్ఫూర్తితోనే ‘యంగ్ ఇండియా’ పేరుతో స్కిల్స్, స్పోర్ట్స్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, పోలీస్ స్కూళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వర్సిటీల్లో 1,603 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గత ప్రభుత్వం తెచ్చిన  ఎంఐఎం సభ్యులు కోరిన ఫస్ట్ లాన్సర్ జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీ ఫైళ్లపై 30 రోజుల్లోగా నివేదికలివ్వాలని ఆదేశించామని, చారిత్రక సిటీ కాలేజీని అభివృద్ధి చేస్తామన్నారు.

32 నెలల్లోనే రూ. 3,488 కోట్ల రీయింబర్స్‌‌మెంట్‌‌

గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి విద్యాసంస్థలకు రూ. 5,430 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు పెట్టి వెళ్లగా, ప్రజా ప్రభుత్వం వచ్చిన 32 నెలల్లోనే రూ. 3,488 కోట్లను విడుదల చేసి ఆదుకుందని సీఎం రేవంత్‌‌ తెలిపారు. నిబంధనలు పాటించని కాలేజీలపై విజిలెన్స్ విచారణను కేసీఆర్ తన పార్టీ ఫిరాయింపుల కోసం వాడుకున్నారని, కేసీఆర్ సన్నిహితుడికి చెందిన ప్రైవేట్ వర్సిటీ ఖాతాలో రూ. 400 కోట్లకు పైగా అక్రమ నిధులు ఎలా మూలుగుతున్నాయో చెప్పాలని నిలదీశారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలున్నా అధికారులను లోపలికి రానివ్వని ఆ కళాశాల బాగోతాలపై విచారణ జరుపుతామని, విజిలెన్స్ క్లీన్‌‌చిట్ ఉన్న జెన్యూన్ కాలేజీలకే రీయింబర్స్‌‌మెంట్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సీపెక్’ సమగ్ర కుల సర్వే ద్వారా ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేకపోవడమే అసలైన సామాజిక వెనుకబాటుతనానికి కారణమని తేలిందని సీఎం వివరించారు.

సర్కారు బడి స్టూడెంట్లకు నాణ్యమైన కిట్లు

సర్కారు బడుల్లోని 27 లక్షల మంది విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మఫత్‌‌లాల్ నాణ్యమైన క్లాత్‌‌తో కుట్టించిన యూనిఫాంలు, స్పోర్ట్స్ డ్రెస్‌‌లు, షూస్, బ్యాగులు సహా 9 వస్తువులతో కూడిన ‘తెలంగాణ స్కూల్ కిట్’ను పంపిణీ చేశామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ఈ గ్లోబల్ టెండర్ విలువే రూ. 687.78 కోట్లు అయితే, కొందరు చదువుకున్న ఐపీఎస్ అధికారులు సైతం రూ. 3 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

గత పాలకులు నాలుగేళ్లపాటు టెట్ నిర్వహించకుండా నిరుద్యోగులను వంచిస్తే, తాము ప్రతి 6  నెలలకోసారి టెట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే కేవలం 55 రోజుల్లోనే ఎలాంటి న్యాయవివాదాలు లేకుండా 10,006 ఉపాధ్యాయ కొలువులను పారదర్శకంగా భర్తీ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్లలో కేవలం 7,857 పోస్టులు మాత్రమే నింపిందన్నారు.  

జాతీయ నిబంధనల ప్రకారం విద్యార్థి–-టీచర్ నిష్పత్తి 39:1 ఉండాల్సి ఉండగా, తెలంగాణలో ప్రతి 17 మంది విద్యార్థులకే ఒక టీచర్ ఉన్నారని, రాష్ట్రంలో మొత్తం 28,163 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని, వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. 4,100 బడుల్లో ప్రీ–ప్రైమరీ ప్రారం భించడంతో ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా 87 వేల వరకు పెరిగిందన్నారు. డ్వాక్రా మహిళలతో ‘అమ్మ ఆదర్శ కమిటీలు’ వేసి రూ. 676 కోట్లతో 26,825 పాఠశాలల్లో 58,632 మౌలిక వసతులను విజయవంతంగా పూర్తి చేయించామని చెప్పారు. 

విద్యా రంగ బడ్జెట్‌‌ను పెంచినం..

గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం 2023–24లో రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్‌‌లో విద్యారంగానికి కేవలం రూ. 19,093 కోట్లు  అంటే 6.53 శాతం కేటాయించి చేతులెత్తేస్తే, తమ ప్రభుత్వం  8.53 శాతం పెంచి కేవలం మూడేండ్లలోనే విద్యా రంగ బడ్జెట్‌‌ను రూ. 7,554 కోట్లు పెంచిందని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వివిధ పథకాలు, మౌలిక వసతులతో కలిపి మొత్తం వ్యయం  రూ. 56 వేల కోట్లకు అంటే దాదాపు 18 శాతానికి చేరిందన్నారు. 

విద్యా రంగానికి చేసే ఖర్చును వ్యయంగా కాకుండా భావితరాల ‘పెట్టుబడి’గా గుర్తించాలని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌లను కోరగా, ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పరిమితి వెలుపల రూ. 4వేల  కోట్ల అదనపు రుణాన్ని కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి లేరంటూ బీజేపీ సభ్యుడు మహేశ్వర్‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రే స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తుంటే ఆ శాఖకు అత్యున్నత ప్రాధాన్యత దక్కినట్లేనని, సీఎం సమీక్ష జరిపితే సీఎస్, ఫైనాన్స్ సెక్రటరీ సహా సమస్త యంత్రాంగం ఒకే టేబుల్ వద్ద కూర్చుని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుందన్నారు.   

 ప్రైవేట్ కాలేజీల మాఫియాపై ఉక్కుపాదం

పదో తరగతి పూర్తయిన తర్వాత జూనియర్ కాలేజీలు దూరంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు చదువు మానేస్తున్నారని (డ్రాపౌట్స్), దీన్ని అరికట్టేందుకే జాతీయ విద్యా విధానం (ఎన్‌‌ఈపీ) తరహాలో 9, 10, 11, 12 తరగతులను ఒకే క్లస్టర్ కిందకు తెస్తున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి చెప్పారు. నారాయణ, శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలు ఇంటర్మీడియెట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నాయని, అందుకే ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 ప్రతి 10 వేల జనాభాకు ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మోడల్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.1,100 నుంచి రూ.1,200 కోట్లు విడుదల చేశామన్నారు. ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టు స్కూల్లో 700 ఉన్న విద్యార్థుల సంఖ్య 1,600కు పెరిగిందని, అడ్మిషన్లు 113 శాతం పెరగడమే కాకుండా 73శాతం మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడికి మారారని వెల్లడించారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పాలిటెక్నిక్‌‌ కళాశాలలు

పాలిటెక్నిక్, ఐటీఐలను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారనే ఆరోపణలను సీఎం రేవంత్‌‌రెడ్డి తోసిపుచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు 100 శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు.  పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిలబస్‌‌ను మార్చేందుకు టాటా గ్రూప్‌‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. రూ.4 వేల కోట్ల సీఎస్సార్ నిధులతో అత్యాధునిక సీఎన్‌‌సీ మెషిన్లు, రోబోటిక్స్, ఆటోమేషన్, ఈవీ ల్యాబ్‌‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 ‘‘ఏటీసీల కోసం ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల రెవెన్యూ భూమిని కేటాయించింది. ఒక్కో ఏటీసీ భవన నిర్మాణానికి రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏటీసీల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.2వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.2,500 చొప్పున స్టైపెండ్‌‌ అందిస్తున్నాం. గతంలో 50-–55శాతం ఉన్న పాలిటెక్నిక్ అడ్మిషన్లు, ప్రభుత్వ సంస్కరణల వల్ల ఈ ఏడాది 95 శాతానికి పెరిగాయి” అని వివరించారు. 

మూడంచెలుగా విద్యా వ్యవస్థ

రాష్ట్రంలోని  విద్యా వ్యవస్థను మూడంచెలుగా వర్గీకరించి పటిష్టపరుస్తున్నట్టు సీఎం ప్రకటించారు 

మొదటి అంచె (నర్సరీ నుంచి 12వ తరగతి వరకు):  మాతృభాష తెలుగే ప్రాతిపదికగా, ఉపాధికి అవస రమైన ఇంగ్లిష్‌‌తోపాటు మూడో ఆప్షనల్‌‌ భాషగా జర్మన్, జపనీస్, చైనీస్, కొరియన్, ఫ్రెంచ్ లేదా హిం దీలలో ఏదో ఒక అంతర్జాతీయ భాషను విద్యార్థులు నేర్చుకునేలా సిలబస్ రూపొంది స్తున్నారు.

 రెండో అంచె (12వ తరగతి నుంచి డిగ్రీ వరకు): ఏటీసీలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించడం.
మూడో అంచె (ఉన్నత విద్య అనంతరం): అంతర్జాతీయ కంపెనీల్లో ఉపాధి, పరిశోధనలు.