- 44 వేల చెరువులకు జియోట్యాగింగ్ పూర్తి: మంత్రి ఉత్తమ్
- నెల్లికల్ ప్రాజెక్టు డిసెంబర్ 2027 నాటికి పూర్తి
హైదరాబాద్, వెలుగు: చెరువులు, కుంటలు, ఇతర జలవనరుల పరిరక్షణతోపాటు వాటిపై ఆధారపడిన మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చెరువుల ఎఫ్‌టీఎల్ హద్దుల పరిరక్షణలో రాజీపడబోమని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని చెరువులకు పరిరక్షణ, నిర్వహణ కమిటీల ఏర్పాటుకు ప్రక్రియ మొదలైందని ఉత్తమ్ తెలిపారు.
ఇప్పటికే దాదాపు 44 వేల చెరువులకు జియోట్యాగింగ్ పూర్తయిందన్నారు. ఎఫ్‌టీఎల్ హద్దుల ఆక్రమణలు, మత్స్యకారుల సమస్యలపై ఫిర్యాదులు వస్తే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారని చెప్పారు. చెరువుల సంరక్షణకు అదనపు నిధులు అవసరమైతే సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నల్గొండ జిల్లాలోని నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసి 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ సభాముఖంగా హామీ ఇచ్చారు.
తొలి దశలో జూన్ 2027 నాటికి 7,800 ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.25.42 కోట్లు మాత్రమే విడుదల చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.310.681 కోట్లు విడుదల చేసిందని మంత్రి చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం, గోధుమలు, చక్కెరతోపాటు పప్పులు, వంట నూనెల వంటి అదనపు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని ఉత్తమ్ తెలిపారు.
