ఆర్మీ వెపన్స్ను గుంతతీసి పాతిపెట్టిండు.. ఆయుధాల చోరీ చేసిన మాజీ ఉద్యోగి అరెస్ట్

ఆర్మీ వెపన్స్ను గుంతతీసి పాతిపెట్టిండు.. ఆయుధాల చోరీ చేసిన మాజీ ఉద్యోగి అరెస్ట్
  • నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్ జిల్లాకు చెందిన హవల్దార్‌‌‌‌‌‌‌‌ ఉప్పుతొల్ల మల్లేశ్ ​అరెస్ట్​
  • డ్యూటీ నుంచి డిస్మిస్ చేశారని కోపంతోనే ఆయుధాల చోరీ 
  • ఆగస్టు 28, 29న రెజిమెంట్‌‌‌‌లో రెక్కీ, 30న రాత్రి అపహరణ
  • కారులో వెపన్స్​ను సొంతూరుకు తరలించి గుంతలో పూడ్చివేత
  • కాల్స్, వాట్సప్ చాటింగ్​ డిలీట్ ​చేయడంతో పోలీసుల అనుమానం
  • అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో దొంగతనం ఒప్పుకున్న మల్లేశ్​
  • ఏకే 203 ఆయుధాలు, పిస్టల్స్, బుల్లెట్లు, బైనాక్యులర్ స్వాధీనం
  • మీడియాకు వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌‌‌‌ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రెజిమెంట్‌‌‌‌లో పనిచేసి ఇటీవల డిస్మిస్​అయిన నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లాకు చెందిన ఉప్పుతొల్ల మల్లేశ్​(37)ను శుక్రవారం అరెస్టు చేశారు. అపహరించిన నాలుగు ఏకే 203 ఆయుధాలు సహా ఇన్‌‌‌‌సాస్‌‌‌‌ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్), పిస్టల్స్, బుల్లెట్లు, బైనాక్యులర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిషనల్‌‌‌‌ డీజీ మహేశ్‌‌‌‌భగవత్‌‌‌‌, మేడ్చల్ మల్కాజిగిరి సీపీ సుమతి సహా ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ శుక్రవారం వెల్లడించారు  

ఇంటి దొంగలపై అనుమానం, దర్యాప్తు 

గత నెల 30న  ఆర్మీ రెజిమెంట్‌‌‌‌ నుంచి ఆయుధాలు చోరీ అయిన నాటి  నుంచి మల్కాజిగిరి పోలీసులు, ఆర్మీ ఇంటెజెన్స్‌‌‌‌ సహా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌‌‌‌, టాస్క్‌‌‌‌ఫోర్స్, ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. మొదటి నుంచీ రెజిమెంట్‌‌‌‌లో పనిచేస్తున్న సిబ్బందిపైనే ఫోకస్​ పెట్టారు. మొత్తం118 మంది సిబ్బందిని విచారించారు. సీసీ టీవీ ఫుటేజ్‌‌‌‌లతోపాటు 8.5 లక్షల ఫోన్ నంబర్లను పరిశీలించారు. అనుమానిత నంబర్లు, సోషల్‌‌‌‌ మీడియా అకౌంట్లను ట్రాక్​ చేశారు. ఇన్ని చేసినా చిన్న క్లూ కూడా దొరకలేదు.  .

ఆగస్టు 28, 29న రెక్కీ 

2010లో మల్లేశ్​ఇండియన్ ఆర్మీలో చేరాడు. 16 ఏండ్లు హవల్దార్‌‌‌‌‌‌‌‌గా పనిచేశాడు. జూన్‌‌‌‌ 30వ తేదీ వరకు బొల్లారంలోని మద్రాస్‌‌‌‌ రెజిమెంట్‌‌‌‌లో పనిచేశాడు. క్రమశిక్షణ, ఇతర కారణాలతో అతడిని జూన్‌‌‌‌ 30న విధుల నుంచి తొలగించారు. దీంతో రెజిమెంట్ అధికారులపై కోపం పెంచుకున్న మల్లేశ్.. ఆయుధాల చోరీకి ప్లాన్​ వేశాడు. అందులో భాగంగా ఆగస్టు 28,29న రెజిమెంట్‌‌‌‌లో రెక్కీ నిర్వహించాడు. గతంలో షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ కారణంగా సీసీ టీవీ కెమెరాలను రాత్రి సమయాల్లో స్విచ్ ఆఫ్ చేయడాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. 

30న రాత్రి 11 గంటలకు తన ఇంటి నుంచి అతడి యాక్టివాపై కార్గిల్ గేట్ ద్వారా మద్రాస్ రెజిమెంట్‌‌‌‌లోకి ప్రవేశించాడు. నేరుగా ఏకే 203, ఇన్‌‌‌‌సాస్‌‌‌‌, రైఫిల్స్‌‌‌‌ సహా ఆయుధాలు ఉన్న బిల్డింగ్​ వద్దకు వెళ్లి తాళాలు పగులగొట్టాడు. ఒక్కొక్కటి తీసుకెళ్లి బైక్‌‌‌‌పై పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ వద్దకు వెళ్లి అక్కడ యాక్టివా పెట్టి మ్యాగజిన్స్​ కోసం తిరిగొచ్చాడు. దారిలో సెక్యూరిటీ గార్డు ప్రశ్నించగా తానూ  మద్రాస్ రెజిమెంట్‌‌‌‌ సిబ్బందినేనని కోడ్స్ చెప్పాడు. దీంతో గార్డ్​ మల్లేశ్​ను లోపలికి అనుమతించాడు. 

బుల్లెట్లు, మందుగుండు సామగ్రి నిల్వ ఉంచిన బిల్డింగ్‌‌‌‌ తాళాలు పగులగొట్టే సమయంలో శబ్దం రావడంతో గార్డ్‌‌‌‌ వచ్చి పరిశీలించగా మల్లేశ్ పక్కనే నక్కి గార్డ్​ వెళ్లిపోయగానే లోపలికి ప్రవేశించి మ్యాగజిన్‌‌‌‌ కవర్లు తీసుకుని బయటపడ్డాడు. ఆయుధాలు, ఇతర సామగ్రితో ఇంటికి చేరుకున్న మల్లేశ్.. 31 తెల్లవారుజామున 4.34 గంటలకు ఆయుధాల బ్యాగ్​ తీసుకొని తన కారులో బాలాజీనగర్‌‌‌‌‌‌‌‌లోని తన నివాసం నుంచి బయల్దేరి ఎల్బీనగర్‌‌‌‌, సాగర్ రింగ్‌‌‌‌ రోడ్డు‌‌‌‌ మీదుగా అచ్చంపేట చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా సాగర్‌‌‌‌ ‌‌‌‌రోడ్డు రింగ్​రోడ్డులోని ట్యాక్సీ పాయింట్‌‌‌‌ వద్ద నలుగురిని, మధ్యలో డిండి వద్ద మరో ఇద్దరిని ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. వీరిని ఆయా ప్రాంతాల్లో దింపి చార్జ్​ తీసుకున్నాడు. 

గుంతతీసి దాచిపెట్టాడు ..

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా జంగంరెడ్డిపల్లిలోని తన ఇంటికి వెళ్లిన తర్వాత గడ్డివాము పక్కనే గుంత తీసి ఆయుధాలు, బుల్లెట్లు ఉన్న బ్యాగ్‌‌‌‌ను అందులో దాచిపెట్టాడు. పోలీసుల దర్యాప్తు విషయం తెలిసి ఈ నెల 5,6వ తేదీల్లో అక్కడి నుంచి ఆయుధాలను మరోచోటుకు మార్చాడు. మల్లేశ్​పై అనుమానంతో ఈ నెల 7న పోలీసులు అతడి నివాసానికి వెళ్లి విచారించారు. 8 లేదా 9వ తేదీల్లో హైదరాబాద్ రావాలని సూచించారు. 

దీంతో మల్లేశ్​ ఆయుధాలను సమీపంలోని పదార అనే గ్రామంలో స్నేహితుడి ఇంటి దగ్గర భద్రపరిచే ప్రయత్నం చేశాడు. కుదరకపోవడంతో మళ్లీ అక్కడి ఈ నెల 8న తన నివాసానికే ఆయుధాలను తీసుకొచ్చి భార్యకు విషయం చెప్పాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఆయుధాలు చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు.  పోలీసులు అతడి ఇంటి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మిస్టరీ వీడిందిలా 

క్రమశిక్షణ చర్యల కారణంగా విధులకు దూరంగా ఉన్న వాళ్లతోపాటు అనారోగ్యం కారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన వారి పేర్లను పోలీసులు షార్ట్‌‌‌‌ లిస్ట్ చేశారు. వీరిలో ప్రవర్తన బాగోలేక ఉద్యోగంలోంచి తొలగించిన నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డి పల్లికి చెందిన హవల్దార్‌‌‌‌‌‌‌‌ ఉప్పుతొల్ల మల్లేశ్​(37) సహా ఏడుగురిని గుర్తించి విచారించారు. వాళ్ల ఫోన్​కాల్స్​తోపాటు సోషల్‌‌‌‌ మీడియా అకౌంట్లను పరిశీలించారు. 

వీరిలో మల్లేశ్​ను ఈ ఏడాది జూన్‌‌‌‌ 30న విధుల నుంచి తొలగించినట్లు గుర్తించారు. ఈయన ప్రస్తుతం రెజిమెంట్‌‌‌‌ సమీపంలోని బాలాజీనగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ నాగర్ కర్నూల్‌‌‌‌లోని శ్రీపురంలో ఇల్లు కడుతున్నాడు. ఈ క్రమంలో మల్లేశ్​ కదలికలపై నిఘా పెట్టి రెజిమెంట్‌‌‌‌ పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నెల 7న పోలీసులు నాగర్ కర్నూల్‌‌‌‌ వెళ్లి మల్లేశ్​ను విచారించారు. వాట్సాప్‌‌‌‌ చాటింగ్స్, కాల్​లాగ్ పూర్తిగా డిలీట్ చేసినట్లు గుర్తించారు. ఆయన భార్య, మామయ్య సహకారంతో గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు. ఆధారాలు ముందుంచడంతో ఆయుధాల అపహరణ గుట్టువిప్పాడు.