- బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపణ
- రేవంత్ ఇంటిని 22ఏ నుంచి రాత్రికి రాత్రే తొలగించారని వెల్లడి
- తెలంగాణ భవన్‌లో పీపీపీ
హైదరాబాద్, వెలుగు: 22ఏ వ్యవహారం మహా కుంభకోణమని, భూభారతి పేరుతో ప్రజల ఆస్తులకు భూహారతి ఇస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. 30 శాతం కమీషన్ల కోసమే లక్షలాది మంది భూములు, ఇండ్లను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వ్యవహారంపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీపీ) ఇచ్చారు. రేవంత్ రెడ్డి పాలనంతా భూముల చుట్టే తిరుగుతున్నదని అన్నారు.
హెచ్‌సీయూ, లగచర్ల, స్కిల్ వర్సిటీ, మూసీ, హైడ్రా.. ఇలా ఏ నిర్ణయం వెనుక చూసినా వేల కోట్ల భూముల దందానే కనిపిస్తోందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులైన రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణను గాలికొదిలేసి.. తమ అనుయాయులకు భూములు కట్టబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజలను 22ఏ పేరుతో ఇబ్బంది పెడుతున్నందుకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత భూములు, 30 శాతం కమీషన్ల దందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
సీఎంకు ఒక న్యాయం.. ప్రజలకొక న్యాయమా?
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ భూములు 22ఏ జాబితాలో పడగానే.. అందులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స్థలాన్ని తెల్లారేసరికి నిషేధిత జాబితా నుంచి తొలగించారని హరీశ్ రావు చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఉన్న న్యాయం.. రాష్ట్రంలోని లక్షలాది మంది సాధారణ పౌరులకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లు కాక పిల్లల పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని, రోగాలకు వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ‘‘2025 సెప్టెంబర్ 31న ప్రభుత్వమే కలెక్టర్లకు ఆదేశాలిచ్చి, 15 రోజుల్లో కొత్త నిషేధిత భూముల జాబితా పంపాలని ఒత్తిడి తెచ్చింది.
దాంతో కలెక్టర్లు పాత డేటాతో ఉన్నఫలంగా లిస్టులు పంపారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో 30 వేల ఎకరాలు, మంచిర్యాలలో 11 వేలు, యాదాద్రిలో 40 వేలు నిషేధిత జాబితాలోకి నెట్టేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట్, అమీన్‌పూర్‌లో 1,500 ఎకరాలు (50 వేల ఇండ్లు), మేడ్చల్‌లో 100 (5 వేల కుటుంబాలు), సింఫొనీ కాలనీలో 4 వేల ఇండ్లు.. ఇలా ఊళ్లకు ఊళ్లు, కాలనీలకు కాలనీలే 22ఏ కిందకు వెళ్లిపోయాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ నుంచి వేలాది మంది బాధితులు లబోదిబోమంటూ దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారు’’ అని పేర్కొన్నారు.
