- ఏఐసీటీఐ గుర్తింపు ఎప్పట్లాగే కొనసాగుతుంది
- పాలిటెక్నిక్ లేజీల భూములను అమ్ముతామనడం అబద్ధం
- బీఆర్ఎస్ నేతల ఆరోపణల్లో వాస్తవం లేదు
- ఫీజులను పెంచి ఆర్థిక భారం మోపే ఉద్దేశం లేదని వెల్లడి
- అసెంబ్లీలో విద్యపై చర్చ సందర్భంగా మంత్రి కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునీకరించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థులు, లెక్చరర్లలో నెలకొన్న సందేహాలకు శుక్రావారం అసెంబ్లీ వేదికగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవి పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న ఏఐసీటీఈ గుర్తింపు కొనసాగుతుందని, ఈసెట్ద్వారా ఇంజినీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ అవకాశాల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలను సుమారు రూ.800 కోట్లతో ఆధునీకరించేందుకు ప్రతిపాదించామన్నారు.
రక్షణ, ఫార్మాస్యూటికల్స్ సహా భవిష్యత్‌లో వేగంగా అభివృద్ధి చెందనున్న రంగాలకు అవసరమైన కొత్త నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే ఉన్న కోర్సులను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన కొత్త స్కిల్ సెట్స్‌కు అనుగుణంగా అదనపు కోర్సులు, ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తామని వివరించారు. అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలను పొందాలనుకునే విద్యార్థులకు అవసరమైన అదనపు నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఫీజులను మార్చం
పాలిటెక్నిక్‌ల ఫీజుల విషయంలో జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు రూ.2 వేల స్టైపెండ్ అందించే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. పాలిటెక్నిక్‌లను స్కిల్ వర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వ లెక్చరర్ల ఉద్యోగ హోదా మారుతుందన్న ఆందోళన అవసరం లేదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా వారి హోదా కొనసాగుతుందని, ప్రమోషన్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పాలిటెక్నిక్‌లకు సంబంధించిన అంశాలపై విద్యార్థులు, లెక్చరర్లతో చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ చర్చలు జరుపుతోందని చెప్పారు. జీవో 97పై కూడా అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీలు) ఆధునీకరణకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐలను ఆధునీకరించే ప్రక్రియ చేపట్టామని, ఇందుకోసం రూ.2,500 కోట్ల పెట్టుబడితో 65 ఏటీసీలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మరో 54 కొత్త ఏటీసీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏటీసీల్లో కొత్త కరిక్యులమ్‌ను రూపొందించామని తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరికి ఈ కరిక్యులమ్‌ను వివరించగా.. ఆయనతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మిక శాఖ మంత్రులు కూడా ప్రశంసించారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా కరిక్యులమ్ రూపొందించేందుకు తనను కమిటీకి చైర్మన్‌గా నియమించారని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
మనకు నాలుగు క్లస్టర్లు
పీఎం సేతు పథకంలో భాగంగా ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణా కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక్కో క్లస్టర్ కేటాయించగా, తెలంగాణకు నాలుగు క్లస్టర్లు మంజూరయ్యాయని వెల్లడించారు. వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.1,000 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏటీసీల్లో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థుల్లో సుమారు 99 శాతం మందికి ప్లేస్‌మెంట్లు లభించాయని మంత్రి తెలిపారు. ఏటీసీ విద్యార్థులకు రూ.2,000 స్టైపెండ్ అందించే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని చెప్పారు.
తెలంగాణ యువతకు జర్మనీ, జపాన్ తదితర దేశాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. జర్మన్, జపనీస్ భాషలతో పాటు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి విదేశీ ఉద్యోగాలకు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. జర్మనీలో సుమారు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు, పాస్‌పోర్టులు ఇప్పిస్తామని చెప్పి ప్రైవేటు ఏజెన్సీలు యువతను మోసం చేస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్‌కామ్ ద్వారా నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలను అనుసంధానం చేస్తున్నామన్నారు.
జపాన్ పర్యటనలో హిరోషిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నామని మంత్రి తెలిపారు. వొకేషనల్ ట్రైనింగ్, విద్యార్థుల ఎక్స్ఛేంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రచారమంతా అబద్ధం
పాలిటెక్నిక్ కాలేజీల భూములను ప్రభుత్వం విక్రయిస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి వివేక్ అన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే 54 ఏటీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం 282 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ఒకవైపు ఏటీసీల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూములు కేటాయిస్తుంటే, మరోవైపు భూములను అమ్మేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
విద్యార్థులు, లెక్చరర్లు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పాలిటెక్నిక్‌ల ఆధునీకరణకు సీఎస్ఆర్ నిధులను వినియోగించడం వల్ల ప్రైవేటీకరణ జరుగుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. పరిశ్రమలు తమ సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలకు నిధులు అందించవచ్చని చెప్పారు. సీఎస్ఆర్ నిధులను పాలిటెక్నిక్‌ల ఆధునీకరణకు వినియోగించినా వాటి నిర్వహణ, నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
