MBBS Seats: తెలంగాణకు కొత్తగా వెయ్యి మెడికల్ సీట్లు..66 కాలేజీల్లో NMC ఆమోదం

MBBS Seats: తెలంగాణకు కొత్తగా వెయ్యి మెడికల్ సీట్లు..66 కాలేజీల్లో NMC ఆమోదం
  • తెలంగాణ వ్యాప్తంగా10,450కి చేరిన ఎంబీబీఎస్ సీట్లు
  • దేశవ్యాప్తంగా 836 కాలేజీల్లో 
  • 1.40 లక్షల సీట్లతో మ్యాట్రిక్స్ విడుదల 
  • అనుమతించిన సీట్లకు మించి 
  • అడ్మిషన్లు ఇస్తే కఠిన చర్యలు: ఎన్ఎంసీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా 1,010 ఎంబీబీఎస్​ సీట్లు పెరిగాయి. దీంతో తెలంగాణలోని 66 మెడికల్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య 10,450కి చేరింది. 2026–27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్‌‌ను ఎన్ఎంసీ పరిధిలోని మెడికల్ అసెస్‌‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్​బీ) శుక్రవారం విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 1,010 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అత్యధిక మెడికల్ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. 

రాష్ట్రంలోని 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,400 సీట్లు ఉన్నాయి. ఇందులో 4,290 సీట్లు రెన్యువల్ కాగా.. 110 సీట్లు కొత్తగా పెరిగాయి. మహబూబ్‌‌నగర్, సిద్దిపేట కాలేజీల్లో 25 చొప్పున, నిజామాబాద్ ప్రభుత్వ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్‌‌లో 30 చొప్పున సీట్లు పెరిగాయి. 30 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6,050 సీట్లు ఉన్నాయి. ఇందులో 5,150 సీట్లు రెన్యువల్ కాగా.. 900 సీట్లు కొత్తగా చేరాయి. కొత్తగా ఏర్పాటైన రాజరాజేశ్వరి ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మహిళా కాలేజీ)లో 150 సీట్లు ఉన్నాయి. ఇతర ప్రైవేట్ కాలేజీల్లో సీట్ల పెంపుతో మిగతా సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

దేశవ్యాప్తంగా 1,40,214 సీట్లు..

ఎయిమ్స్, జిప్మర్ వంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలను మినహాయించి దేశవ్యాప్తంగా 836 మెడికల్ కాలేజీల్లో 1,40,214 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 445 ప్రభుత్వ కాలేజీల్లో 63,971 సీట్లు, 391  ప్రైవేట్ కాలేజీల్లో 76,243 సీట్లు ఉన్నాయి. కొత్త కాలేజీలు, సీట్ల పెంపుతో ఈ ఏడాది 13,186 సీట్లు పెరగగా.. 1,27,028 సీట్లు రెన్యువల్ అయ్యాయి. కర్ణాటక 15,745 సీట్లతో మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌‌లో 14,400, తమిళనాడులో 14,299, మహారాష్ట్రలో 13,249 సీట్లు ఉన్నాయి. ఏపీలో 40 కాలేజీల్లో 7,615 సీట్లు ఉన్నాయి.

అదనంగా అడ్మిషన్లు ఇస్తే చర్యలు..

మెడికల్ కాలేజీలు తమకు ఆమోదించిన సీట్ల మేరకే అడ్మిషన్లు ఇవ్వాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఒక్క సీటు అదనంగా భర్తీ చేసినా ఎన్ఎంసీ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. క్రిమినల్, జరిమానా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపింది. కౌన్సిలింగ్ కమిటీలు కూడా అనుమతించిన సీట్లకు మించి అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించింది. 

కొత్తగా అనుమతులు పొందిన, సీట్లు పెంచుకున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నోటీసు వెలువడిన ఏడు రోజుల్లోగా ఎంఏఆర్​బీ  డైరెక్టర్ పేరిట ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది. గ్యారంటీ పరిశీలన పూర్తయిన తర్వాతే లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.