రామగుండం అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి..కార్మికులకు అండగా పోరాటానికి సిద్ధం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రామగుండం అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి..కార్మికులకు అండగా పోరాటానికి సిద్ధం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని/జగిత్యాల/వెల్గటూర్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. ఎన్టీపీసీ టౌన్​షిప్ లోని ఐఎన్టీయూసీ నేషనల్​ లీడర్, ఎన్​బీసీ మెంబర్​ బాబర్​ సలీంపాషా నివాసంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు.

రైల్వేల అభివృద్ధి, సౌకర్యాల కోసం ఎప్పటికప్పుడు రైల్వే ఉన్నతాధికారులను మాట్లాడుతున్నానని చెప్పారు. రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్  కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాకా వెంకటస్వామి కాలం నుంచి తమ కుటుంబం, కాంగ్రెస్  పార్టీ నిరంతరం కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతున్నాయని చెప్పారు. ఎన్టీపీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులతో, ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడానని, కార్మికులకు న్యాయం జరగకపోతే వారి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు.

ఎన్టీపీసీ యాష్​పాండ్​ కోసం 600 ఎకరాల భూమి సేకరిస్తున్న మోగిల్  పహాడ్, రాజాపూర్  రైతులకు న్యాయం చేయాలని, నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాకే  ప్లాంట్​ పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ సంస్థల చైర్మన్లు తమ సొంత ఎజెండాలను పక్కనబెట్టి, సంక్షేమం దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  దళితుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నా బీజేపీ నాయకులు స్పందించడంలేదన్నారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  శుద్ధి కార్యక్రమాల పేరుతో దళితులను అవమానిస్తున్నాయని విమర్శించారు. అంతకుముందు ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ  నాయకులు బాబర్  సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి ఆధ్వర్యంలో ఎంపీని సన్మానించారు. తర్వాత ఇటీవల చనిపోయిన గోదావరిఖనికి చెందిన బాలసాని రాజయ్య, చందనాల వీరస్వామి, సుందిళ్లకు చెందిన నారాయణ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. 

కార్మికుల రక్షణపై సింగరేణి దృష్టి సారించాలి

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణ చర్యలపై దృష్టి సారించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్​ను ఎంపీ సందర్శించి, ఇటీవల జీడీకే 11వ గని ప్రమాదంలో గాయపడిన సాగర్​ అనే కార్మికుడిని పరామర్శించారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

పాశిగామ ప్రైమరీ స్కూల్ కు  రూ. 18 లక్షల ఎంపీ లాడ్స్​ నిధులుగతంలో పాశిగామ స్కూల్​కు వచ్చినప్పుడు పిల్లలు చెట్ల కింద చదువుకోవడం చూసి బాధ పడ్డానని, వారి ఇబ్బందులు తొలగించాలని భావించానని వంశీకృష్ణ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ ప్రైమరీ స్కూల్​కు శుక్రవారం విశాఖ చారిటబుల్  ట్రస్ట్  ఆధ్వర్యంలో బెంచీలను అందజేశారు. పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి ఎంపీ లాడ్స్  నుంచి రూ.18 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

కాకా వెంకటస్వామి స్ఫూర్తితో విశాఖ చారిటబుల్  ట్రస్ట్  ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అవసరమైన చోట పాఠశాలలకు బెంచీలు, బోర్‌‌‌‌‌‌‌‌వెల్స్  ఇస్తున్నామని, టీచర్లను నియమిస్తున్నామన్నారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా ట్రస్ట్​ ద్వారా సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా లైబ్రరీ చైర్మన్  సంగనభట్ల దినేశ్, కాడే సూర్యనారాయణ పాల్గొన్నారు.