న్యూఢిల్లీ: భారత ఫారెక్స్ రిజర్వులు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో ఏకంగా రికార్డు స్థాయిలో 44.903 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం నిల్వలు జీవితకాల గరిష్ఠమైన 785.706 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలోనూ ఇవి 11.475 బిలియన్ డాలర్లు పెరిగి 740.803 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పుడు రూపాయిని నిలబెట్టేందుకు ఆర్‌బీఐ డాలర్లను విక్రయించడంతో నిల్వలు తగ్గుతూ వచ్చాయి.
అయితే రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు జూన్‌లో ఆర్‌బీఐ చేపట్టిన ప్రత్యేక రాయితీ ఫారెక్స్ స్వాప్ చర్యల వల్ల ఏకంగా 136 బిలియన్ డాలర్ల మేర కొత్త నిధులు దేశంలోకి రావడంతో నిల్వలు అనూహ్యంగా పుంజుకున్నాయి.
ఆర్‌బీఐ డేటా ప్రకారం, ఫారెక్స్ రిజర్వులలో ప్రధాన భాగమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ సెప్టెంబర్ 4 తో ముగిసిన వారంలో 47.498 బిలియన్ డాలర్లు పెరిగి 648.168 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో బంగారం నిల్వల విలువ 2.594 బిలియన్ డాలర్లు తగ్గి 113.816 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. ఐఎంఎఫ్ వద్ద ఉండే నిల్వలు 4.916 బిలియన్ డాలర్లకు చేరాయి.
