తెలంగాణలో కృత్రిమ పనీర్‌‌‌‌పై నిషేధం.. నాన్ డెయిరీ, అనలాగ్ పనీర్ అమ్మకాలు బంద్

తెలంగాణలో కృత్రిమ పనీర్‌‌‌‌పై నిషేధం.. నాన్ డెయిరీ, అనలాగ్ పనీర్ అమ్మకాలు బంద్
  • ఏడాదిపాటు నాన్ డెయిరీ, అనలాగ్ పనీర్ తయారీ, అమ్మకాలు బంద్
  • ప్రజారోగ్యం దృష్ట్యా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌‌‌మెంట్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నాన్ డెయిరీ, ఆర్టిఫీషియల్, అనలాగ్ పనీర్‌‌‌‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌‌‌‌ఫుడ్ సెంటర్లలో స్వచ్ఛమైన పనీర్ పేరుతో కృత్రిమ పనీర్‌‌‌‌ను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతుండడంతో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌‌‌మెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాన్ డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌‌‌‌ను తయారు చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ ఆదేశాలు తక్షణమే  అమల్లోకి వస్తాయని, ఏడాది పాటు కొనసాగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిబంధనలకు విరుద్ధంగా నకిలీ దందా..

గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ) వెజిటబుల్ ఫ్యాట్‌‌‌‌తో చేసే అనలాగ్ పనీర్ ఉత్పత్తులకు అనుమతినిచ్చింది. అయితే, దీనిని ప్యాకెట్లపై ‘అనలాగ్ పనీర్’ అని స్పష్టంగా లేబుల్ వేసి మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉంది. కానీ, వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పనీర్ తయారు చేస్తున్నారు. 

హోటళ్ల నిర్వాహకులు అధిక లాభాల కోసం, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనే ఉద్దేశంతో ఈ నకిలీ పనీర్‌‌‌‌ను వాడుతున్నారు. పైగా ఇది వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు, రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుంది. స్వచ్ఛమైన పనీర్ అయితే రంగు మారదు. వేళ్లతో నలిపితే పనీర్ పొడిపొడిగా రాలుతుంది. కానీ కృత్రిమ పనీర్ రబ్బర్​లా సాగుతుంది.