- ఆర్‌డీఎస్‌ఎస్‌లో వ్యవసాయ మీటర్ల నిబంధన లేదు
- ఉదయ్ ఒప్పందానికి మించిఒక్క అడుగు ముందుకు వేయం
- ఈ నెల 9న 19,543 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్
- వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ.14 వేల కోట్లు
- ఇండ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కోసం మరో రూ.5 వేల కోట్లు
- ఇలా ఏటా రూ.19 వేల కోట్లు ప్రభుత్వం భరిస్తోందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ మోటార్లు, పంప్‌సెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో భట్టి మాట్లాడుతూ భూమ్యాకాశాలు ఏకమైనా.. ఎవరెంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రైతులకు ప్రభుత్వం తరఫున వంద శాతం హామీ ఇస్తున్నానని భట్టి పేర్కొన్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన ఆర్‌డీఎస్‌ఎస్‌లో లేదని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య ఉదయ్ త్రైపాక్షిక ఒప్పందం జరిగిందన్నారు. ఆ ఒప్పందానికి మించి ప్రస్తుత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదని స్పష్టం చేశారు.
విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణే లక్ష్యం..
ఆర్‌డీఎస్‌ఎస్ కింద విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడం, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఈ పథకం కింద కేంద్రం 60 శాతం గ్రాంట్ ఇస్తుండగా.. మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 9న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,543 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైందని భట్టి వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో వ్యవసాయ పంప్‌సెట్ల వినియోగం పెరిగి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందన్నారు.
ఏటా రూ.19 వేల కోట్ల భారం..
రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా దాదాపు రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తోందని భట్టి తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం మరో రూ.5 వేల కోట్లు భరిస్తోందన్నారు. మొత్తంగా ఏటా రూ.19 వేల కోట్ల విద్యుత్ వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు. ఈ భారాన్ని తగ్గించేందుకు రైతులపై ఎలాంటి అదనపు భారం వేయకుండా సోలార్ పంప్‌సెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రైతులు సోలరైజేషన్‌కు అంగీకరించకపోయినా ప్రస్తుత ఉచిత విద్యుత్ సదుపాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ ద్వారా పగటిపూట ఉత్పత్తయ్యే సోలార్ విద్యుత్‌ను నిల్వ చేసి రాత్రిపూట వినియోగించేలా చర్యలు చేపడతామని భట్టి చెప్పారు. తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
