చర్చలే శాంతికి మార్గం: న్యూఢిల్లీ డిక్లరేషన్కు బ్రిక్స్ దేశాల ఆమోదం

చర్చలే శాంతికి మార్గం: న్యూఢిల్లీ డిక్లరేషన్కు బ్రిక్స్ దేశాల ఆమోదం

బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపాయి బ్రిక్స్ దేశాలు. 2026 సెప్టెంబర్ 12వ తేదీన న్యూఢిల్లిలోని భారత్  మండపంలో జరిగిన  బ్రిక్స్ సదస్సులో.. డిక్లరేషన్ పై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో ప్రధాని మోదీ ప్రవేషపెట్టిన డిక్లరేషన్ కు సభ్యదేశాలు ఆమోదించాయి.

చర్చలే శాంతికి మార్గమని న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టం చేసింది. అన్ని రకాల దురాక్రమణలను ఖండించింది.  ఇంధన భద్రత, సురక్షిత నౌకా రవాణాకు ఈ డిక్లరేషన్ పిలుపునిచ్చింది. అణ్వాయుధాలు, యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశాల మధ్య అనిశ్చితిని తగ్గించేందుకు, శాంతియుత పరిష్కారానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని డిక్లరేషన్ పేర్కొంది.

ALSO READ : మేం ఎవరికీ వ్యతిరేకం కాదు.. అందరినీ కలుపుకుని పోతాం

అదేవిధంగా ఏకపక్ష వాణిజ్యంపై బ్రిక్స్ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. టారిఫ్, నాన్ టారిఫ్ అంశాలతో ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం కలిగించే విధానాలను వ్యతిరేకించింది. దేశాల మధ్య ఉన్న అనిశ్చితికి, వివాదాలకు కారణమైన విషయాలను గుర్తించి శాంతియుత మార్గాలలో పరిష్కారం చూపే విధంగా ముందుకు సాగాలని.. ఆ విధంగా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఉండాలని ఆకాంక్షించింది. 

ఉగ్రవాద చర్యలను బ్రిక్స్ డిక్లరేషన్ ఖండించింది. వాటిని నేరపూరితమైనవిగా, సమర్థనీయం కానివిగా పేర్కొంటూ,  పహల్గామ్ దాడిని ప్రస్తావించింది. ఏప్రిల్ 2025లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో  26 మంది పౌరులు మరణించారు. ఈ దాడిని బ్రిక్స్ కూటమి సంయుక్తంగా ఖండించింది.  

డిక్లరేషన్ కు ఏకాభిప్రాయం సాధించడం సంతోషకరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ఎంతో అర్థవంతంగా, ఫలప్రదంగా జరిగిందని అన్నారు.