22ఏ మా ప్రభుత్వం తీసుకురాలేదు.. 1999లోనే అమల్లోకి: మంత్రి పొంగులేటి

22ఏ మా ప్రభుత్వం తీసుకురాలేదు.. 1999లోనే అమల్లోకి: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: 22ఏ నిషేధిత భూముల అంశంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏను తమ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదని, 1999లోనే 22ఏ నిబంధన అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకే 22ఏను తీసుకొచ్చారని తెలిపారు.2015లో 22ఏ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చిందని పొంగులేటి అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 22ఏ భూములను ఐదు కేటగిరీలుగా విభజించారని, అనంతరం 2016లో జీవో నంబర్ 121ను తీసుకొచ్చారని చెప్పారు. అయితే జీవో జారీ చేసినప్పటికీ అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించలేదన్నారు.

ధరణి తీసుకొచ్చే క్రమంలో కోర్టు ఆదేశాలను పక్కన పెట్టారని పొంగులేటి ఆరోపించారు. 2017 నుంచి 2025 వరకు 28,611 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమస్యల కారణంగా భూబాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు.నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించిందని మంత్రి తెలిపారు. కోర్టు సూచించిన నియమనిబంధనల ప్రకారం కమిటీని ఏర్పాటు చేసి, నిషేధిత జాబితాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని చెప్పారు.

కొత్తగా ఏ భూమినీ 22ఏలో చేర్చలేదు

తమ ప్రభుత్వం కొత్తగా ఏ భూమినీ నిషేధిత జాబితాలో చేర్చలేదని పొంగులేటి స్పష్టం చేశారు. గతంలో ఉన్న భూములే ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు.22ఏ జాబితాలో పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించిన మంత్రి.. అధికారులు ఉద్దేశపూర్వకంగా గానీ, స్వలాభం కోసం గానీ ఆ తప్పులు చేయలేదన్నారు.జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించిందని పొంగులేటి తెలిపారు. మూడు విడతల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులతో చర్చలు జరిపామని చెప్పారు. సంబంధిత కాపీలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.
కేవలం రెండు రోజుల్లోనే 22ఏకు సంబంధించిన పొరపాట్లను పరిష్కరించి రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభించామని మంత్రి వెల్లడించారు.

ఫేక్ జీవోలపై ఎఫ్‌ఐఆర్‌లు

ప్రభుత్వం సమస్యను పరిష్కరించిన తర్వాతే ప్రతిపక్షాలు మేల్కొన్నాయని పొంగులేటి విమర్శించారు. ఫేక్ జీవోలను సృష్టించి ప్రజల్లో గందరగోళం సృష్టించారని ఆరోపించారు.నకిలీ జీవోలు సృష్టించిన వారిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. ఈ వ్యవహారంలో దళారుల వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని పొంగులేటి వ్యాఖ్యానించారు.