ఢిల్లీలో చైనా అధ్యక్షుడి ల్యాండింగ్: 24 గంటల పర్యటనకి.. 15 వేల మందితో ఊహించని రేంజ్లో సెక్యూరిటీ!

ఢిల్లీలో చైనా అధ్యక్షుడి ల్యాండింగ్:  24 గంటల పర్యటనకి.. 15 వేల మందితో  ఊహించని రేంజ్లో సెక్యూరిటీ!

చైనా అధ్యక్షుడు  షీ జిన్‌పింగ్ బ్రిక్స్ (BRICS) సదస్సులో పాల్గొనేందుకు శనివారం(సెప్టెంబర్ 12) భరతదేశ  రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత మళ్ళీ ఆయన భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. సుమారు 24 గంటల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అయితే వాణిజ్యం, పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.

షీ జిన్‌పింగ్‌తో పాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చింది. విదేశీ ప్రతినిధుల రాకతో ఢిల్లీ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తాజ్ ప్యాలెస్‌ పై  
ఢిల్లీలోని 'తాజ్ ప్యాలెస్' హోటల్‌లో  జిన్‌పింగ్ బస చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ హోటల్‌ పరిసరాలను పూర్తిగా 'నో-ఫ్లై జోన్'గా ప్రకటించారు. బాంబ్ స్క్వాడ్, ఉగ్రవాద నిరోధక బృందాలు హోటల్ పరిసరాలను వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. రేడియేషన్, అణు, జీవరసాయన (బయో కెమికల్) ముప్పులను గుర్తించే అత్యాధునిక పరికరాలతో  హోటల్ పరిసరాలను తనిఖీలు చేసారు. హోటల్ చుట్టూ ఉన్న అండర్ గ్రౌండ్ పైప్‌లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలను కూడా నిశితంగా పరిశీలించారు.

 

10 రోజుల ముందే 
చైనా అధ్యక్షుడు ప్రయాణించే అత్యంత సురక్షితమైన 'హాంగ్‌కీ స్టేట్ లిమోసిన్' (Hongqi State Limousine) కారుతో పాటు మరో బ్యాకప్ వాహనాన్ని, కమ్యూనికేషన్ పరికరాలను ప్రత్యేక కార్గో విమానంలో 10 రోజుల ముందే భారతదేశానికి తరలించారు.

ఎగిరే కమాండ్ సెంటర్..  
షీ జిన్‌పింగ్ ప్రయాణించే ఎయిర్ చైనాకు చెందిన 'బోయింగ్ 747-8' విమానం ఒక మొబైల్ కమాండ్ సెంటర్‌లా పనిచేస్తుంది. ఎన్‌క్రిప్టెడ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, క్షిపణి రక్షణ వ్యవస్థలు (Missile Defence Systems), ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ (EMP) షీల్డింగ్ ఉన్న ఈ విమానం ద్వారా ప్రయాణంలోనూ ఆయన చైనా సైనిక, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలతో సంప్రదింపులు జరపవచ్చు.

 

15,000 మంది పోలీసులు.. 700 సీసీటీవీలు
భారత ప్రభుత్వ ఏజెన్సీలు ఢిల్లీ వ్యాప్తంగా అభేద్యమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. బలగాల మోహరింపులో భాగంగా  15 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని, 200 పారామిలిటరీలను రంగంలోకి దించారు. నిఘా వ్యవస్థలో భాగంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాంతి పథ్ మార్గంలో 700కు పైగా సీసీటీవీ కెమెరాలు, 5 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో 500 కెమెరాల ఫీడ్‌ను నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక సీసీటీవీ కంట్రోల్ రూమ్‌ను రెడీ చేశారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు భారత్ మండపం నుంచి బయలుదేరి షీ జిన్‌పింగ్ తిరిగి చైనాకి ప్రయాణమవుతారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ ప్రకారం ఢిల్లీ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలు సమన్వయంతో ఈ పర్యటన భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.