ఏషియన్ గేమ్స్ నుంచి ఔట్.. ఇక నేను సచ్చిపోతానన్న అథ్లెట్! 

ఏషియన్ గేమ్స్ నుంచి ఔట్.. ఇక నేను సచ్చిపోతానన్న అథ్లెట్! 

రాబోయే ఐచి-నాగోయా ఆసియా గేమ్స్‌కు ముందు భారత క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేగింది. ట్రయల్స్‌లో గెలిచి అర్హత సాధించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించి, రెండుసార్లు ఆసియా గేమ్స్ పతక విజేత నౌరెమ్ రోషిబినా దేవికి అవకాశం ఇచ్చారని టీనేజ్ వుషు అథ్లెట్ దివ్యాన్షి చౌదరి సంచలన ఆరోపణలు చేసింది. వుషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా (WAI) వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చానని కన్నీటి పర్యంతమైంది.

నన్ను బాగా హింసిస్తున్నారు: 

కొద్ది రోజుల క్రితం వరకు ఆసియా గేమ్స్ కిట్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సంబరపడిన దివ్యాన్షి, తాజాగా విడుదల చేసిన వీడియోలో బాగా ఏడుస్తూ కనిపించింది. మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినాను తాను ట్రయల్స్‌లో ఓడించినప్పటికీ, ఆమె కోసమే జూన్, జులై నెలల నుంచి అసోసియేషన్ తనను మానసికంగా వేధిస్తోందని దివ్యాన్షి వాపోయింది. ఇది స్పష్టంగా అధికార దుర్వినియోగమేనని, జపాన్ వెళ్లే తన హక్కును కాలరాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

గాయం దాచడం వల్లే తీసేశాం: అసోసియేషన్ క్లారిటీ

ఈ వివాదంపై స్పందించిన వుషు అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ బజ్వా దివ్యాన్షి ఆరోపణలను ఖండించారు. ఆమె పేరును అసోసియేషన్ తీసివేయలేదని, తీవ్రమైన మోకాలి (ACL) గాయాన్ని దాచిపెట్టినట్లు తేలడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)నే ఆమెను జట్టు నుంచి తొలగించిందని స్పష్టం చేశారు. దివ్యాన్షి తండ్రి సునీల్ కూడా ఆమెకు ఏసీఎల్ గాయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ రీహాబ్ ద్వారా చికిత్స పొందుతోందని ఒప్పుకున్నాడు. 

రోషిబినా ఎంపికపై వివరణ: 

ట్రయల్స్ ఫైనల్లో ఓడిపోయిన ప్లేయర్లకు కాకుండా సెమీఫైనల్లో ఓడిపోయిన రోషిబినాను ఎందుకు ఎంపిక చేశారనే దానికి బజ్వా వివరణ ఇచ్చారు. ఫైనల్‌కు చేరిన ఇద్దరు అథ్లెట్లు కూడా గాయపడటంతోనే అనుభవం ఉన్న రోషిబినాను ఎంపిక చేయాల్సి వచ్చిందని, అంతే తప్ప ఎవరికీ పక్షపాతం చూపలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే పతకం ఆశతో ఉన్న యంగ్ అథ్లెట్ ఆత్మహత్య హెచ్చరికలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.