దేశ రాజకీయాల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం కలకలం రేపుతోంది. ఎలాంటి గుర్తింపు లేని, కేవలం కాగితాల మీద మాత్రమే నడుస్తున్న వేల సంఖ్యలోని రాజకీయ పార్టీలు ఏకంగా రూ.10వేల కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డాయంటూ కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. పన్నులు చెల్లించని బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు ఈ బోగస్ పార్టీలను ఒక షీల్డ్‌లా వాడుకుంటున్నారని.. దీనిపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరపాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్.
రూ.10వేల కోట్ల విరాళాల స్కామ్..
దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ ఈ భారీ కుంభకోణాన్ని బయటపెట్టారు. దేశవ్యాప్తంగా సుమారు 3వేల 260 రిజిస్టర్డ్ అనధికారిక రాజకీయ పార్టీలు విరాళాల పేరుతో భారీగా అక్రమ లావాదేవీలు జరిపాయని ఆరోపించారు. రౌండ్-ట్రిప్పింగ్ తదితర అక్రమ మార్గాల ద్వారా లెక్కల్లో చూపని నల్లధనాన్ని అధికారిక విరాళాలుగా మారుస్తూ ఆదాయపు పన్ను శాఖకు కోట్లలో టోపీ పెడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ అండదండలతోనే..
ఈ బోగస్ పార్టీలన్నింటి వెనుక అధికార బీజేపీ ప్రభుత్వ హస్తం ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ ఎక్స్ పోస్టులో విమర్శించారు. ఈ 3వేల 260 నకిలీ రాజకీయ పార్టీలకు అసలు సూత్రధారి ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, కక్షసాధింపు చర్యలకు పాల్పడిన టాక్స్ డిపార్ట్మెంట్.. ఈ వేల కోట్ల పన్ను ఎగవేతలపై మాత్రం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.
చట్టాల దుర్వినియోగం..
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రాజకీయ పార్టీలకు లభించే పన్ను మినహాయింపులను ఈ భోగస్ పార్టీలు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నాయి. దోషులుగా తేలిన వారికి చట్ట ప్రకారం 200 శాతం జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అక్రమాలకు సహకరిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ల లైసెన్సులు రద్దు చేయాలని, బోగస్ పార్టీలను నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
జేపీసీ విచారణతోనే అసలు నిజాలు..
ఈ భారీ కుంభకోణంలో రూ.10వేల కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినా మోడీ సర్కార్ ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. రాజకీయ పార్టీల నిధులు, వ్యయాలను పర్యవేక్షించడంలో ఎన్నికల సంఘం కూడా విఫలమైందని విమర్శించింది. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని, అసలు నిందితులను తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)తో సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
