సంప్రదాయాలు, సంతోషాల కలబోత అయిన వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది ! ఈ సంవత్సరం సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఇంట్లోనూ బొజ్జ గణపయ్యను కొలువుదీర్చి, 9 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించడం ఆచారం. అయితే వినాయకుడిని ఇంటికి తెచ్చుకునే ముందు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా వాస్తు, జ్యోతిష్య నిబంధనలను పాటించడం కూడా చాలా ముఖ్యం......
మీ ఇంట్లో బొజ్జ గణపయ్యను ప్రతిష్టించే ముందు గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే:
1. విగ్రహం సైజు
ఇంట్లో పూజించడానికి 9 నుండి 11 అంగుళాల ఎత్తు ఉన్న విగ్రహం అత్యంత అనువైనది. దీనికంటే పెద్ద విగ్రహాలను తెస్తే రోజూ పూజ చేయడం, ఆ తర్వాత నిమజ్జనం చేయడం కష్టమవుతుంది.
2. కూర్చున్న విగ్రహం
ఇంట్లో ప్రతిష్టించడానికి నిలబడి ఉన్న గణపతి కంటే కూర్చుని ఉన్న విగ్రహం అత్యంత శుభప్రదం. ఇది ఇంట్లో శాంతి, స్థిరత్వం, శాశ్వత ఆనందానికి ప్రతీక. విగ్రహానికి నాలుగు చేతులు ఉండాలి. ఒక చేతిలో పాశం, ఇంకో చేతిలో అంకుశం, మరొక చేతిలో మోదకం (కుడుము), నాల్గో చేయి అభయ హస్తంతో ఉండాలి.
3. తొండం ఏ దిశలో ఉండాలి?
ఎడమ వైపునకు తిరిగి ఉన్న తొండం (వామముఖి గణపతి) ఉన్న విగ్రహాన్ని తీసుకోవడం ఇంటికి చాలా శుభప్రదం. ఇది శాంతి, శ్రేయస్సును ఇస్తుంది. కుడివైపునకు తొండం ఉన్న గణపతిని 'సిద్ధివినాయకుడు' అంటారు. ఈ రూపాన్ని పూజించడానికి కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది.
4. మూషిక వాహనం (ఎలుక)
విగ్రహాన్ని కొనేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఆయన వాహనమైన 'ఎలుక' ఉందో లేదో తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ఎలుక లేని విగ్రహం అపూర్ణంగా పరిగణించబడుతుంది.
ALSO READ : మీ రాశి ప్రకారం ఏ రంగు వినాయకుడిని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అంటే ?
5. ప్రతిష్టించే దిశ
ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు స్వామివారి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని (పొజిటివ్ ఎనర్జీని) తీసుకువస్తుంది.
ఈ 5 వాస్తు నియమాలను పాటిస్తూ విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి, ఈ పండుగ రోజున స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి!
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
