కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కి తోడు వినాయక చవితి కూడా కలిసిరావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలో కంపార్టుమెంటులన్నీ నిండిపోయి బయట క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. దీంతో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంటులు నిండిపోవడంతో బయట శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. ఇదిలా ఉండగా.. శనివారం 81 వేల 724 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 38 వేల 361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు.శనివారం శనివారం ఒక్కరోజే 4.39 లక్షల శ్రీవారి లడ్డూ ప్రసాదం సేల్స్ జరిగినట్లు తెలిపారు.
అయితే.. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో అలిపిరి దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు భక్తులు. టోల్ గేట్ దగ్గర తనిఖీలకు ఎక్కువ సమయం పడుతున్న క్రమంలో కొందరు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ఘాట్ రోడ్ లో వాహనాల సంఖ్య పెరిగిన క్రమంలో వాహనదారులు వేగంగా రావద్దని సూచించింది టీటీడీ.
