హరీశ్ తన మామ పేరుమీద.. సిద్దిపేటలో 6 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హరీశ్  తన మామ పేరుమీద.. సిద్దిపేటలో  6 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు తన పరపతిని ఉపయోగించి వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు.

సిద్ధిపేట జిల్లా వెలికట్టి గ్రామంలో హరీశ్‌రావు తన మామ హనుమంతరావు పేరిట 6 ఎకరాల 18 కుంటల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారని, రూ. 12 నుంచి 18 కోట్ల విలువ చేసే ఈ భూమిని 22-ఏ నుంచి తొలగించి పట్టా భూమిగా మార్చుకున్నారని తెలిపారు. ఇదే భూమిలో వెళ్లిన మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు కూడా డబ్బులు తీసుకున్నారని తెలిపారు

ఇక మెదక్ జిల్లాలోనూ భారీ భూ కుంభకోణం జరిగిందని మంత్రి ఆరోపించారు. సిక్లిందాపూర్ పరిధిలో వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన 569 ఎకరాల్లో, 2023 ఎన్నికల షెడ్యూల్‌కు కేవలం 5 రోజుల ముందు 372 ఎకరాలకు పైగా భూమికి ఆర్డీవో ద్వారా ఓఆర్‌సీలు ఇప్పించి కాజేశారని మండిపడ్డారు. ఈ అక్రమ భూముల ద్వారా వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. నర్సాపూర్ మండలంలోనూ 22-ఏ నిబంధనల నుంచి 112 ఎకరాలు భూములను తొలగించి ఒకే కుటుంబానికి కట్టబెట్టారని, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గెలవకుండా కుట్ర పన్నారని పొంగులేటి తీవ్ర స్థాయిలో విమర్శించారు.