1980 ట్రెండ్ ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారా.?.. ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి..

1980 ట్రెండ్ ఫోటో ఎడిటింగ్  చేస్తున్నారా.?.. ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి..

హైదరాబాద్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 1980ల రెట్రో ఫోటో ఎడిటింగ్ ట్రెండ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను హెచ్చరించింది. ఆకర్షణీయమైన ఫోటో ఎడిటింగ్ ఆఫర్ల పేరుతో పంపే లింకులు, యాప్‌ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని సూచించింది.క్లిక్ చేసే ముందు ఆలోచించండి.. ఇన్‌స్టాల్ చేసే ముందు నిర్ధారించుకోండి అంటూ TGCSBసూచించింది.

ఉచిత ఫోటో ఎడిటింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల వల

ఉచితంగా, అపరిమితంగా రెట్రో ఫోటో ఎడిటింగ్ చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఆకర్షణీయమైన ప్రకటనలు, మెసేజ్ లు పంపే అవకాశం ఉందని  తెలిపింది. SMS, WhatsApp, సోషల్ మీడియా తదితర మార్గాల్లో అనుమానాస్పద లింకులను పంపి వాటిపై క్లిక్ చేయించే ప్రయత్నాలు జరగవచ్చని హెచ్చరించింది.

అధికారిక యాప్‌లకు బదులుగా హానికరమైన APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయించే అవకాశం ఉందని  తెలిపింది. ఇలాంటి యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తే వ్యక్తిగత, ఆర్థిక సమాచారానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. హానికరమైన యాప్‌ల ద్వారా మొబైల్‌లోని SMSలు, OTPలు, కాంటాక్ట్స్, నోటిఫికేషన్లు, బ్యాంకింగ్, ఆర్థిక సమాచారం వంటి కీలక డేటాను సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందనిహెచ్చరించింది.

అంతేకాకుండా మొబైల్‌లో భద్రపరిచిన సున్నితమైన సమాచారాన్ని కూడా కొల్లగొట్టి, దాని ఆధారంగా ఆర్థిక మోసాలు, అనధికార లావాదేవీలు, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది.

TGCSB సూచనలు ఇవే..

  • తెలియని SMS, WhatsApp, సోషల్ మీడియా లింకులపై క్లిక్ చేయొద్దు.
  • గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయొద్దు.
  • యాప్‌లను అధికారిక, విశ్వసనీయ App Stores నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు అది అడిగే Permissions‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
  • OTPలు, PINలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయొద్దు.
  • అనుమానాస్పద యాప్ కనిపిస్తే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
  • మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
  • సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, అలాగే cybercrime.gov.in ద్వారా సైబర్ నేరాన్ని రిపోర్ట్ చేయాలని TGCSB ప్రజలకు విజ్ఞప్తి చేసింది.