ఆదిలాబాద్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ల ఆగడాలపై పోలీసుల ఫోకస్

ఆదిలాబాద్  జిల్లాలో ట్రాన్స్ జెండర్ల ఆగడాలపై పోలీసుల ఫోకస్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్  జిల్లాలో ట్రాన్స్ జెండర్ల ఆగడాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ట్రాన్స్ జెండర్లు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వారం రోజుల్లో ఐదుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్​ చేశారు. ఆదిలాబాద్  పట్టణ శివారులోని మావల వద్ద హైవేపై, ఆదిలాబాద్  రూరల్  మండలం జందాపూర్  ఎక్స్ రోడ్  వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేసిన ట్రాన్స్ జెండర్లు నిలేశ్ గజానన్ గడాగే, మోహెక్  ఖాన్  అలియాస్  సోను, ఆదిలాబాద్  పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో సిమ్రాన్ ఖాన్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. 

ఇటీవల హైదరాబాద్ లో ఓ ఇంటి గృహ ప్రవేశానికి వెళ్లి రచ్చ చేయడంతో పోలీస్  శాఖ ట్రాన్స్ జెండర్లపై నిఘా పెట్టారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ట్రాన్స్ జెండర్ల వేధింపులపై బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్  పట్టణంలోని ఎన్టీఆర్  చౌక్ లో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు ట్రాన్స్ జెండర్లు, మరో ఇద్దరు వ్యక్తులు ఆపి డబ్బులు డిమాండ్  చేశారు. అతను డబ్బులు ఇవ్వకపోవడంతో దాడి చేసి బైక్ ను ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రాన్స్ జెండర్  సిమ్రాన్ ఖాన్ ను అరెస్ట్​ చేశారు. ఫైజల్, సమీర్ పరారీలో ఉన్నారు.

నకిలీలపై చర్యలు తీసుకోవాలి

ఉమ్మడి జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్లలో కొంత మంది మాత్రమే ఇలా చేస్తున్నారని, వారి వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఆదిలాబాద్  ట్రాన్స్ జెండర్ల సంఘం అధ్యక్షురాలు అలిజా వాపోయారు. శనివారం ఆదిలాబాద్​ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. తమ కమ్యునిటీలో కొంత మంది నకిలీ ట్రాన్స్ జెండర్ల చర్యలతో తమ కమ్యూనిటీ మొత్తంపై నింద వేయడం సరైంది కాదన్నారు. వికృత చేష్టలతో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.