- ప్రజా సమస్యలపై పోరాడకుండా స్పీకర్‌ను తిట్టే దాకా వెళ్లాయి
- సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలర్ల సంఘానికి అధ్యక్షుడు
- హరీశ్‌ను కాపాడుతోంది ఆయనే
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తారనుకుంటే అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్షాలు బాహబాహీకి దిగి తిట్టుకున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. కొట్లాట కాస్తా స్పీకర్‌ను దుర్భాషలాడే వరకు వెళ్లడం దారుణమన్నారు. ఈ సంఘటనలన్నీ చూస్తే మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్సీగా చాలా బాధగా ఉందన్నారు. అధికార, ప్రతిపక్షాలు 10 నిమిషాలు సభలో కలిసి పనిచేస్తే లక్షలాది మంది ప్రజల సమస్యలు పరిష్కారమైన ఘటనలు దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయన్నారు. ఇక బీజేపీ సభ్యులు సగం మంది బీఆర్ఎస్, సగం మంది కాంగ్రెస్‌కు మద్దతిస్తూ విచిత్రమైన పాత్ర పోషించారని విమర్శించారు.
సీఎం తానేదో స్వాతిముత్యం అన్నట్లు అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేస్తూ కమల్ హాసన్ లా నటించారని ఎద్దేవా చేశారు. తన అడ్వర్టైజ్మెంట్ కోసమే అసెంబ్లీని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. తన పాపాలు కడుక్కోవటానికి, క్యారెక్టర్ గొప్పదని చెప్పటానికి తనకు కమీషన్లు ఎందుకు ఆయన అంటున్నారని, నిజానికి బ్లాక్ మెయిలర్స్ సంఘం పెడితే దానికి సీఎం రేవంత్ అధ్యక్షులు అవుతారని ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఆంధ్రావాళ్లతో కలిసి క్యాష్ డీల్ చేసి దొరికిపోయింది రేవంత్ కాదా అని గుర్తు చేశారు.
దేవుడు ఆయనకు అన్నీ ఇచ్చిండు రాష్ట్రాన్ని దోచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఓ మిత్రమండలిని, భయంకరమైన ఫ్యామిలీని, బోలెడంత మంది అవినీతి మినిస్టర్లను భగవంతుడు ఇచ్చాడని కవిత అన్నారు. 22ఏ పేరుతో పొంగులేటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇసుక ద్వారా సీతక్క కమీషన్లు తెచ్చి ఇచ్చేలా వాళ్లకు రాసిచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక అవినీతి సామ్రాట్ అన్నారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన వ్యక్తి రేవంత్ అని అన్నారు. విద్యా శాఖ, హోంశాఖ మంత్రిగా ఆయన అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. హరీశ్‌ను కాపాడుతున్నారన్నారు. ఇద్దరి మధ్య ఏం సంబంధం లేకుంటే.. హరీశ్‌పై రేవంత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
