హైదరాబాద్, వెలుగు: నేషనల్ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో 4,20,626 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 1.40 లక్షల పెండింగ్ కేసులు, 2.78 లక్షల ప్రిలిటిగేషన్ కేసులు ఉన్నాయి. మొత్తం రూ.266 కోట్ల పరిహారం లబ్ధిదారులకు అందినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి వెల్లడించారు.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యాంకోశీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ కె.లక్ష్మణ్ సలహాలు, సూచనలతో లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు.
2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడి భార్య ఎం.సునీతకు రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించగా, లోక్ అదాలత్‌లో రూ.5 కోట్లు చెల్లించేందుకు శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ అంగీకరించి, వెంటనే చెక్ అందజేసింది.
మరో కేసులో రూ.1.75 కోట్లు చెల్లించేందుకు శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించింది. హైకోర్టులో జస్టిస్ కె.సుజన, జస్టిస్ నందికొండ నర్సింగ్రావు నిర్వహించిన లోక్‌అదాలత్ బెంచ్‌లో 182 కేసులు పరిష్కరించినట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు.
