పంచాయతీల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

 పంచాయతీల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
  • పంచాయతీల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
  • మంత్రి సీతక్కను సన్మానించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రామ పంచాయతీలకు ఆర్థిక సాధికారత కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మాటల్లో కాదు.. చేతల్లో గ్రామ స్వరాజ్యం చూపిస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టానికి సవరణ తీసుకురావడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్కను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు.

పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో కాకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని ఆ గ్రామ అభివృద్ధికే ఖర్చు చేసుకోవాలన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొంత ఆదాయం కోసం సర్పంచులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, అంతర్గత రోడ్ల వంటి అత్యవసర పనులకు ఇకపై నిధుల కొరత ఉండదన్నారు.