నేరడిగొండ, వెలుగు: ఆదివాసీ హక్కుల సాధన, పరిరక్షణ కోసం ఆదివాసీలంతా ఒక్కటై కదలాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ‘ఆదివాసీ మార్చ్-- చలో ఉట్నూర్’ వాల్ పోస్టర్లు, కరపత్రాలను రిలీజ్ చేశారు. ముందుగా కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1976 నుంచి గిరిజనులుగా అక్రమంగా కొనసాగుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఎస్టీ జాబితాను పున పరిశీలించి రిజర్వేషన్ అంశంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐటీడీఏ పరిధిలో ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. ఈ నెల 16న ఉట్నూర్ లో నిర్వహించనున్న ఆదివాసీ మార్చ్ ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సంఘ నాయకులు పుర్క బాపురావు, కొడప నగేశ్, పెందూర్ దాదిరావు, పుర్క చిత్ర, పెందూర్ మహేందర్, తొడసం శంకర్, కోట్నాక్ కోటేశ్, ఆత్రం భీంరావు పాల్గొన్నారు.
