- ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి విజ్ఞప్తిపై రేవంత్‌రెడ్డి సానుకూల స్పందన
హైదరాబాద్,వెలుగు: ఆశ్రమ పాఠశాలల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఆశ్రమ స్కూళ్లలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ నిలిచిపోవడంతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, పోస్టుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తన కార్యదర్శి వేముల శ్రీనివాస్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల పట్ల ఆశ్రమ పాఠశాలల పండిట్, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.
తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆశ్రమ స్కూళ్ల యూనియన్ నేతలు నరేష్, ప్రతాప్ సింగ్, సురేష్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
