- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక యజమానులుగా తీర్చిదిద్దడమే ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ముఖ్య ఉద్దేశమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.70 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించినట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం శాసనమండలిలో ఆమె మాట్లాడారు.
ఈ రుణాలకు సంబంధించి రూ.1,903 కోట్ల వడ్డీని చెల్లించామని, ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీ చెల్లింపులు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఆర్థిక సహాయంతో 16 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, ఒక్కో సభ్యురాలికి సగటున రూ.1.80 లక్షల రుణం అందిస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు పథకంతో మహిళా సంఘాలను బస్సుల యజమానులుగా మారుస్తున్నామని, దీని ద్వారా ఒక్కో బస్సుపై నెలకు సుమారు రూ.70 వేల ఆదాయం వస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, బజార్ల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.
ఇందులో భాగంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ లోమహిళా సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఇప్పటివరకు దాదాపు రూ.11 కోట్ల వ్యాపారం చేశాయన్నారు. రాబోయే వీటి వ్యాపారం మరింత పెరగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల తయారీ వంటి కార్యక్రమాల్లోనూ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రైస్ మిల్లులు, గోదాములను కూడా మహిళా సంఘాల నిర్వహణకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
