- 40 వేల టన్నుల ఉత్పత్తికి బ్రేక్
జయశంకర్ భూపాలపల్లి/కోల్ బెల్ట్, వెలుగు : అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతుండడంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి, శనివారం రోజంతా వర్షం పడడంతో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2, 3, మంచిర్యాల జిల్లా పరిధిలోని మూడు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు నిలిచిపోగా, డోజర్లు డంపింగ్ యార్డులకే పరిమితమయ్యాయి. వర్షం కారణంగా కేటీకే 1 గనిలో 4,500 టన్నులు, కేటీకే 2 గనిలో 5,500 టన్నుల ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ రెండు గనుల్లో 10 వేల టన్నుల ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు రూ. 40 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓసీపీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్పార్పీ, ఇందారం ఓసీపీల్లో సుమారు 30 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. గనుల యార్డుల్లోకి చేరిన వర్షపు నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. వర్షం పూర్తిగా తగ్గితే కానీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.
ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం
ములుగు/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మంగపేట మండలంలో అత్యధికంగా 50.1 మిల్లీమీటర్ల వాన పడగా.. వెంకటాపురంలో 40.9, తాడ్వాయిలో 33.4, మల్లంపల్లిలో 32, కన్నాయిగూడెంలో 26.2, గోవిందరావుపేటలో 26, ఏటూరు నాగారం లో 23.8, వాజేడు మండలంలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బూర్గంపహాడ్ లో 64.5 మీల్లీమీటర్ల వర్షం పడగా... కొత్తగూడెంలో 55, సీతారాంపట్నంలో 52.8, అన్నపురెడ్డిపల్లిలో 49.8, భద్రాచలంలో 47.8, ఆళ్లపల్లి, చుంచుపల్లిలో 45.8, లక్ష్మీదేవిపల్లిలో 43.8, ములకలపల్లిలో 39.8, టేకులపల్లిలో 37.5, ఇల్లెందు, జూలూరుపాడులో 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
