హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవం అంటే భక్తి, సందడి, శోభాయాత్రలే కాదు.. ఇప్పుడు ఇదో భారీ ఫెస్టివల్ ఎకానమీ. గల్లీ మండపం నుంచి భారీ విగ్రహాల వరకు పూలు, పూజా సామగ్రి, అలంకరణలు, సౌండ్ సిస్టమ్స్, క్యాటరింగ్, రవాణా, క్రేన్లు, టెంట్ హౌస్‌లు, లడ్డూలు, ప్రకటనల దాకా ప్రతి రంగంలోనూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నగరంలో 1.4 లక్షల మండపాలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా జరిగే మొత్తం ఆర్థిక కార్యకలాపాలు రూ.50 వేల కోట్ల వరకు ఉండొచ్చని అనధికార అంచనా.
గతేడాది ఉత్సవాల్లో రూ.650 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు అంచనా వేయగా, ధూల్‌పేట్‌లోనే రూ.50 కోట్ల వ్యాపారం జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. కాలనీ ఉత్సవాల బడ్జెట్లూ పెరిగాయి. కొన్ని పెద్ద కమ్యూనిటీల్లో రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. లక్షలాది కార్మికులు, కళాకారులకు ఉపాధి లభిస్తుండగా, చిన్న వ్యాపారులు, వీధి విక్రేతలకూ గిరాకీ పెరిగింది. స్పాన్సర్‌షిప్స్, ప్రకటనల ఖర్చు మరో రూ.650 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
హైదరాబాద్ నుంచి ముంబై దాకా.. భారీ జాతర!
హైదరాబాద్‌తోపాటు ముంబై, ఢిల్లీ, పుణే, నాగ్‌పూర్, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో గణేశ్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా మండపాలు, మహారాష్ట్రలోనే 7 లక్షల మండపాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.
మహారాష్ట్ర నగరాల్లో ఒక్కో చోట ఏటా కోట్లలో ఖర్చవుతుందని అంచనా. ముంబైలో ఉత్సవ వ్యయం రూ.1 లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత15 ఏళ్లలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రూ.246 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
మట్టి ఖరీదు.. విగ్రహం ధరకు రెక్కలు!
ముడిసరుకులు, సహజ మట్టి ధరలు పెరగడంతో విగ్రహాల ధరలు 20–30 శాతం పెరిగాయి. గతేడాది రూ.1.20 లక్షలున్న15 అడుగుల విగ్రహం ఈసారి రూ.1.65 లక్షలకు చేరింది. నిమజ్జనం, భద్రత, ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
హెచ్ఎండిఎ, జిహెచ్ఎంసి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి లక్షలాది పర్యావరణహిత మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. నిమజ్జన ఊరేగింపులకు ట్రైలర్లు, టస్కర్ల అద్దెలు దూరాన్ని బట్టి రూ.4,500 నుంచి రూ.33,000 వరకు ఉన్నాయి.
ఎకో గణేశ్.. సీడ్ గణపతికి క్రేజ్!
ఈసారి ఎకో గణేశ్, సీడ్ గణపతి, థీమ్ విగ్రహాలు, గణేశ్ ఆగమనం, కమ్యూనిటీ సెలబ్రేషన్స్‌కు ఆదరణ పెరిగింది. మట్టి విగ్రహంలో విత్తనాలు పెట్టి, నిమజ్జనం తర్వాత మొక్క పెంచే విధానం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కాలనీ సంక్షేమ సంఘాలు 4,500 మట్టి విగ్రహాలు ఏర్పాటు చేశాయి. ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి, నాగోల్‌లో 72 అడుగుల అష్టసిద్ధి గణపతి, వనస్థలిపురంలో 40 అడుగుల లక్ష్మీనరసింహ గణపతి థీమ్ విగ్రహాలు సందడి చేస్తున్నాయి.
ఒక అడుగు నుంచి 69 అడుగుల దాకా!
ఖైరతాబాద్ గణేష్ ప్రస్థానం1954లో ఒక అడుగు విగ్రహంతో మొదలైంది. ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిలో ఐదు ముఖాలు, ఆరు చేతులు, ఐదు తలల నాగు ప్రత్యేక ఆకర్షణ. విగ్రహానికి 30 టన్నుల నది మట్టి, 20 టన్నుల ఇసుక, 25 టన్నులకు పైగా స్టీల్, ఎండిన వరి గడ్డి వాడారు. తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడుకు చెందిన150 మందికిపైగా కళాకారులు పనిచేశారు. ఆర్గానిక్ రంగులు వాడగా, పక్కన15 అడుగుల సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత రూపాలు ఏర్పాటుచేశారు.
50 కిలోల నుంచి 6 వేల కిలోల వరకు!
2009 వరకు ఖైరతాబాద్‌లో 50 కిలోల లడ్డూ ఉండేది. 2010లో తాపేశ్వరం తయారీదారు పీవీవీఎస్ మల్లికార్జునరావు సమర్పణతో భారీ లడ్డూ సంప్రదాయం మొదలైంది. 2010లో 500 కిలోల నుంచి 2015లో ఏకంగా 6,000 కిలోలకు చేరింది. 2016లో విభేదాలతో మార్పు వచ్చినా, 2018లో హైదరాబాద్ వ్యాపారి 300 కిలోల లడ్డూ సమర్పించి 10 వేల మందికి ప్రసాదంగా పంపిణీ చేశారు. 2020లో మల్లీబాబు మళ్లీ 100 కిలోల తాపేశ్వరం లడ్డూ సమర్పించారు.
బాలాపూర్ లడ్డూ.. అదృష్టానికి వేలం!
గణపతికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను నిమజ్జనం రోజున వేలం వేయడం మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతోంది. భక్తులు దాన్ని దక్కించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. 2025లో 21 కిలోల బాలాపూర్ లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. అంతకుముందు ఏడాది ఉన్న రూ.30 లక్షల రికార్డును ఇది అధిగమించింది. భక్తిని పంచడమే కాదు.. ఉపాధిని పెంచుతూ, వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తూ హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు గణేష్ ఉత్సవం తనదైన ఊపునిస్తోంది.
గణపతి శిల్పి
చినస్వామి రాజేంద్రన్‌కు ఖైరతాబాద్ గణేశ్‌తో 1978 నుంచి అనుబంధం ఉంది. రామకృష్ణ స్టూడియోస్‌లో సినిమా సెట్ల డిజైనర్‌గా పనిచేసిన ఆయన తొలి ఖైరతాబాద్ విగ్రహాన్ని 9 అడుగులతో రూపొందించారు. ఎన్టీఆర్ ఆయన కళను ప్రశంసించారు.1982లో ఆయన రూపొందించిన ఎలుక గణేశ్‌ను చూసిన కె.విశ్వనాథ్, సాగర సంగమంలో కమల్ హాసన్ నృత్య సన్నివేశాలను దాని ముందు చిత్రీకరించారు. ప్రతి ఏడాది గణేష్ రూపకల్పనలో సిద్ధాంతి గౌరీపట్ల విఠల్ శర్మతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం.
