వినాయక చవితి రోజు పుస్తకాలకు పూజ.. అసలు రహస్యం ఇదే..!

వినాయక చవితి రోజు పుస్తకాలకు పూజ.. అసలు రహస్యం ఇదే..!

హైదరాబాద్​లో  గణేష్​ ఉత్సవాల సందడి మొదలైంది.  ఈ ఏడాది  సెప్టెంబర్​ 14న వినాయకచవితి పండుగను పిల్లలు.. పెద్దలు.. అందరూ జరుపుకొనేందుకు సిద్దమయ్యారు.  ఇప్పటికే చాలామంది విగ్రహాలను ఇంటికి తెచ్చుకొనే పనిలో ఉన్నారు.  మరో ముఖ్య విషయం ఏంటంటే గణేషుడిని పూజ చేసేటప్పుడు పిల్లలు చదువుకొనే పుస్తకాలను వినాయకుడి దగ్గర ఉంచి పూజ చేస్తారు.  అసలు గణుషుడికి.. పుస్తకాల పూజకు సంబంధం ఏమిటి.. పండితులు.. పురాణాలు ఏంచెబుతున్నాయి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

వినాయక చవితి రోజున పుస్తకాలకు, చదువుకునే వస్తువులకు పూజ చేయడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. వినాయకుడు బుద్ధికి, జ్ఞానానికి మరియు సర్వ విద్యలకు అధిపతి. అందుకే చదువుల్లో రాణించడానికి, జ్ఞానం సిద్ధించడానికి  వినాయకచవితి రోజు గణేష్​ దగ్గర పుస్తకాలు,పెన్నులు. పెన్సిళ్లు ఉంచి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.

శ్రీ వినాయకుని విద్య, జ్ఞానం, బుద్ధి, వివేకానికి ప్రతీకగా భావిస్తా రు. అందుకే వినాయక చవితి రోజున పిల్లల పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని వినాయకుడి సమక్షంలో ఉంచి పూజించడం ఆనవాయితీగా ఉంది.

పురాణాల ప్రకారం, వేదవ్యాసుడు చెప్తుంటే మహాభారతాన్ని తన దంతంతో రాసింది వినాయకుడే. ఈ విధంగా గణేశుడు ప్రపంచంలోనే తొలి రచయితగా, లిపికి అధిపతిగా మారారు. కాబట్టి రాయడానికి, చదవడానికి ఉపయోగించే పుస్తకాలు, కలాలకు ఆయన రోజున పూజ చేయడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు

మంచి బుద్ధి కలగాలని : పిల్లలు చదువులో ఏకాగ్రత సాధించి, మంచి జ్ఞానం సంపాదించి, విషయాలను సులభంగా అర్ధం చేసుకోవా లని వినాయకుడిని ప్రార్థిస్తారు.

ఆటంకాలు తొలగాలని: వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అంటే అడ్డంకులను తొలగించేవాడు. పిల్లల విద్యాభ్యాసంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆటంకాలు తొలగి విజయవంతంగా చదువుకోవా లని పుస్తకాలను పూజలో ఉంచుతారు.

విద్యకు గౌరవం: పుస్తకం కేవలం కాగితాల సమాహారం కాదు.. అది జ్ఞానానికి ప్రతీక. పుస్తకాలను పూజించడం ద్వారా విద్యను పవిత్రమైనదిగా, విలువైనదిగా భావించే సంస్కారం పిల్లల్లో పెంపొండుతుంది.

చదువుల తల్లి అనుగ్రహం కోసం: హిందూ సంప్రదాయంలో సరస్వతీ దేవిని విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాన దేవతగా భావిస్తారు. వినాయకుడు, సరస్వతీ దేవి అనుగ్రహంతో పిల్లలకు మంచి జ్ఞానం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కలగాలని కోరుకుంటారు.

మొదటి అక్షరాలు వేర్చే సమయంలో:  చిన్న పిల్లలు మొదటిసారి అక్షరాలు నేర్చుకునే సమయంలో  ( అక్షరాభ్యాసం రోజున) వినాయకుడిని ప్రార్థించి విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం శుభాపరంగా భావిస్తారు. దీనిని కొన్ని ప్రాంతాల్లో విద్యారంభం / అక్షరాభ్యాసంతో అనుసంధానిస్తారు.

వినాయకచవితి చవితి రోజున పుస్తకాలను పూజలో ఉంచి, మరుసటి రోజు (ఉద్వాసన పలికే ముందు లేదా ఆ తర్వాత) వాటిని తీసి చదువుకోవడం వల్ల వినాయకుని అనుగ్రహంతో విద్యావిజయం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు.

అసలు సందేశం

పుస్తకాలను పూజలో పెట్టడం అంటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలని మాత్రమే కోరుకోవడం కాదు "జ్ఞానాన్ని గౌరవించాలి. విద్యను సద్వినియోగం చేసుకోవాలి. మంచి బుద్ధితో జీవించాలి" అనే విలువను పిల్లలకు నేర్పించడ మే ప్రధాన ఉద్దేశం. అందుకే వినాయక చవితి రోజున పుస్తకాలను శుభ్రంగా అమర్చి, వాటిపై పసుపు కుంకుమ పెట్టి, వినాయకుడి ముందు ఉంచి పూజిస్తారు. పూజు పూర్తయ్యే వరకు వాటిని ఉపయోగించకుడా ఉంచే ఆచారం కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.