సికింద్రాబాద్ లో లష్కర్ గణపతి.. 200 ఏళ్ల చరిత్ర.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

సికింద్రాబాద్ లో లష్కర్ గణపతి.. 200 ఏళ్ల చరిత్ర.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

 హైదరాబాద్​.. సికింద్రాబాద్​ ( జంట నగరాల్లో) ఖైరతాబాద్​ వినాయకుడి తరువాత అత్యంత ఫేమస్​ గా సికింద్రాబాద్​ లో లష్కర్​ గణపతిని భక్తులు భక్తి శ్రద్దలతో పూజిస్తారు.  కంటోన్మెంట్​ ఏరియాలో లష్కర్​ గణపతి ఆలయం నిర్మాణానికి చరిత్ర ఏమిటి.. అక్కడ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

సికింద్రాబాద్ లో  రైల్వేలు, కంటోన్మెంటు ఎంత ప్రత్యేక స్థానం ఉండో లష్కర్ గణపతికీ అంతే ప్రత్యేకత ఉంది. దాదాపు రెండు శతాబ్దాల క్రితం నీటి కోసం తవ్విన ఓ బావిలో వెలుగుచూసిన గణపతి విగ్రహం.. నేడు వేలాది మంది భక్తుల ఆరాధ్యదైవంగా నిలిచింది. కాలగమనంలో నగరం రూపురేఖలు మారినా.. ఆ గణపయ్యపై భక్తుల విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. 

వినాయకచవితి వేళ ఈ పురాతన సన్నిధి మరోసారి భక్తజన సందోహంతో కళకళలాడుతుంది.
1824 లో అప్పటి కంటోన్మెంట్ ప్రాంతంలో మద్రాస్ రెజిమెంట్ సిపాయిలు తాగునీటి కోసం బావి తవ్వుతుండగా గణపతి విగ్రహం బయటపడిందని ఆలయ చరిత్ర  ద్వారా తెలుస్తోంది. ఆ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. 

అలా బావిలో వెలిసిన గణపయ్య.. క్రమంగా 'లష్కర్ గణపతి'గా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయంలోని స్వామివారి రూపం కూడా ప్రత్యేకమే. 'విరూపాక్ష గణపతి'గా పిలిచే ఈ విగ్రహం అంకుశం, ఢమరుకం వంటి విశిష్ట లక్షణాలతో దర్శనమిస్తుంది. ఉపనయన సమయంలోని బాల గణపతి రూపాన్ని పోలి ఉండటం కూడా ఈ విగ్రహ ప్రత్యేకతగా ఆలయ సంప్రదాయం చెప్తోంది.

 వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తా రు. విద్యలో విజయం, ఉద్యోగం, వివాహం, కుటుంబంలో శుభం కలగాలని కోరుకుంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. నగర నలుమూలల నుంచి వచ్చే భక్తులతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. 

ఒకప్పుడు నీటి కోసం తవ్విన బావిలో బయటపడిన గణపయ్య.. నేడు సికింద్రాబాద్ నగరానికి ఆధ్యాత్మిక గుర్తుగా నిలిచాడు. లష్కర్ గణపతిపై తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసం మాత్రం సడలలేదు.అంతటి మహిమ గల లష్కర్​ గణపతిని  కంటోన్మెంట్​ ఏరియాలో జరిగే ​ గణనాధుడి ఉత్సవాలను ఓసారి దర్శిద్దామామరి..!