- సబ్ స్టేషన్ల ముట్టడి, రాస్తారోకో చేసిన రైతులు, వివిధ పార్టీల నాయకులు
వెలుగు నెట్ వర్క్ : వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని, విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల రైతులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట మండలం యర్కారం సబ్ స్టేషన్ ని ముట్టడించిన అనంతరం సూర్యాపేట – జనగామ రహదారిపై, యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్ పూర్ వద్ద బీజేపీ నాయకులు, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. వనపర్తి జిల్లా నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండ, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు వనపర్తి – పెబ్బేరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. అలాగే కామారెడ్డి ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట భారతీయ కిసాన్సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట్ మండలం జక్కాపూర్, లక్ష్మీదేవిపల్లి, చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామం వద్ద, నంగునూరు మండలం కొండంరాజుపల్లి సబ్ స్టేషన్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ నాయకుల ఆందోళన చేపట్టారు. ఎల్ నినో కారణంగా వర్షాలు పడకపోవడంతో బోర్ల ద్వారానైనా పంటలు సాగు చేసుకుందామంటే విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కొండంరాజుపల్లి వద్ద ఏఈకి వినతిపత్రం అందించేందుకు సుమారు 40 నిమిషాల పాటు వేచి చూసినా ఆయన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు, నాయకులు సబ్ స్టేషన్ ఆపరేటర్ నరేశ్ ను గదిలో నిర్బంధించారు.
