సెప్టెంబర్19న కోదాడలో మెగా జాబ్ మేళా..యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం :

సెప్టెంబర్19న కోదాడలో మెగా జాబ్ మేళా..యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం :
  •  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ సీసీ రెడ్డి విద్యానిలయంలో ఈ నెల 19న నిర్వహించే మెగా జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల ఆపీసర్లు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించి, పోస్టర్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి పాస్ అయిన వారి నుంచి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ తో పాటు ఇతర ఉన్నత చదువులు పూర్తి చేసి వారు సైతం జాబ్ మెళాకు అర్హులేనని స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో 250కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగులు kodadmegajobmela.com వెబ్ సైట్ లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. 

నమోదు పూర్తైన తర్వాత ప్రతి అభ్యర్థికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ తో ఎకనాలెడ్జ్ మెంట్ వస్తుందని, ఒక్కో అభ్యర్థి గరిష్టంగా ఐదు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని చెప్పారు. జాబ్ మేళాకు వచ్చే క్యాండిడేట్లు ఎకనాలెడ్జ్ మెంట్ తో పాటు ఐదు సెట్ల బయోడేటా తీసుకురావాలని సూచించారు. 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచే ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.

 జాబ్ మేళా విషయం నిరుద్యోగులకు తెలిసేలా గ్రామాల్లో దండోరా వేయించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ ఉన్నారు. అనంతరం కోదాడ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై స్థానిక ఆర్డీవో ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. షాదీ ఖానా, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.