- ఫ్రీ దర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడినప్పటికీ.. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు.
రద్దీ కారణంగా ధర్మ దర్శనానికి దాదాపు 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి సుమారు గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల వాహనాలతో కొండపైన, కొండ కింద కేటాయించిన పార్కింగ్ ప్రాంగణాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను డైవర్ట్ చేశారు. ఆలయంలో నిర్వహించిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఉదయం లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
స్వయంభు నారసింహుడిని దర్శించుకున్న అనంతరం ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. తర్వాత అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం చేయగా.. సూపరింటెండెంట్ శ్రీకాంత్ స్వామివారి లడ్డూ ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.
