- ఏఐ, టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్, ట్రేడ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో సహకారం
- 5 పాయింట్ల ప్రణాళిక ప్రకటించిన చైనా ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల కోసం ఓపెన్‌సోర్స్ ఏఐ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ ప్రకటించారు. దీని ఏర్పాటుకు చైనా మార్గదర్శిగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో బ్రిక్స్ సమిట్ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిక్స్ దేశాల మధ్య టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్, ట్రేడ్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం కోసం 5 అంశాల ప్రణాళికను ప్రకటించారు.
ఏఐ ఫ్రేమ్‌వర్క్‌తోపాటు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ ఇండస్ట్రీ సంబంధాల బలోపేతం, ఇంటెలిజెంట్ మాన్యుఫాక్చరింగ్, సంయుక్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో కూడిన పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టాలని కూటమిని కోరారు. ‘‘చైనా బ్రిక్స్ ఏఐ ఓపెన్-సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంలో నాయకత్వం వహిస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ధిలో సహకారానికి మద్దతు ఇస్తుంది. ప్రత్యేక ఏఐ సెమినార్లు, శిక్షణా కోర్సులు నిర్వహిస్తుంది.
ఏఐ కోసం ఓపెన్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తుంది” అని ఆయన తెలిపారు. వరల్డ్ ఏఐ కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేయడానికి చైనా దాదాపు 30 దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్లోజ్డ్ ఫ్రేమ్‌వర్క్‌లపై ఆధారపడే ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి ప్రధాన అమెరికన్ డెవలపర్‌ల మాదిరిగా కాకుండా, ఓపెన్ మోడళ్ల ఆధారంగా తక్కువ ఖర్చుతో కూడిన అంతర్జాతీయ ఏఐ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడంపై చైనా దృష్టి పెట్టింది. అయితే, ఏఐ రంగంలో అమెరికాతో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలకు టెక్నాలజీ కేంద్రంగా చైనాను నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే జిన్‌పింగ్ ఈ ప్రకటన చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
