- వెస్ట్ ఆంక్షలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచన
- ఉమ్మడి ఆర్థిక వృద్ధి వేదిక ఏర్పాటుకు రష్యా ప్రెసిడెంట్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత పెంచేందుకు, ఉమ్మడి ధాన్యం మార్కెట్, ప్రత్యేక బీమా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు స్వతంత్ర మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం బ్రిక్స్ ముగింపు సమావేశంలో పుతిన్ ఈ ప్రతిపాదన చేశారు. మూలధనం, కార్మికులు, టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకునేందుకు బ్రిక్స్‌లో ఇప్పటికే స్వతంత్ర మార్గాలు ఉన్నాయని చెప్పారు. బయటి ఒత్తిళ్లతో సంబంధం లేకుండా సభ్య దేశాలు పనిచేయగలవని పేర్కొన్నారు.
ధాన్యం మార్కెట్, బీమా వ్యవస్థ ఏర్పాటు రష్యా ప్రతిపాదిస్తున్నదని తెలిపారు. వీటిని ఇతర సభ్య దేశాలు కూడా ఉపయోగించుకోవచ్చని అన్నారు. రష్యా చమురు రవాణాపై అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో బీమా రంగంలో సమస్యలు ఏర్పడ్డాయి. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ధర పరిమితి విధించిన జీ7, యూరోపియన్ యూనియన్, బ్రిటన్.. ఆ ధరకు మించిన కొనుగోళ్లకు నౌకల బీమాపై ఆంక్షలు పెట్టాయి.
ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ బీమా వ్యవస్థను పుతిన్ ప్రతిపాదించారు. బ్రిక్స్‌లో పెట్టుబడులు, వాణిజ్యం పెంచేందుకు ఉమ్మడి ఆర్థిక వృద్ధి వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు. సభ్య దేశాలకు ఉన్న ప్రత్యేక బలాలను కలిపి కొత్త పెట్టుబడి అవకాశాలు, మార్కెట్ల మధ్య పార్ట్‌నర్‌షిప్ పెంచాలని అన్నారు. ఈ వేదిక బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర స్నేహపూర్వక దేశాలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు.
ఎన్‌డీబీ పనితీరు బాగుంది
ప్రపంచ సమస్యలకు వాటి ప్రభావాలతో పాటు మూల కారణాలను కూడా పరిష్కరించే సమగ్ర విధానం అవసరమని పుతిన్ అన్నారు. ప్రపంచ దక్షిణ దేశాలు కలిసి మెరుగైన ప్రపంచ పాలనా వ్యవస్థ కోసం కృషి చేయాలని సూచించారు. భద్రతా ముప్పులను కూడా సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టం, యూఎన్ చార్టర్ సూత్రాలకు అనుగుణంగా సమస్యలను సామూహికంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) పనితీరును పుతిన్ ప్రశంసించారు. బ్యాంకు ప్రస్తుతం సుమారు 140 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తోందని చెప్పారు.ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 49.5%, ప్రపంచ జీడీపీలో సుమారు 40%, ప్రపంచ వాణిజ్యంలో 26% వాటాను కలిగి ఉన్నాయి.
