ఖమ్మం–దేవరపల్లి ఆక్సిడెంట్ జోన్గా గ్రీన్ఫీల్డ్ హైవే

 ఖమ్మం–దేవరపల్లి ఆక్సిడెంట్ జోన్గా గ్రీన్ఫీల్డ్ హైవే

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం–దేవరపల్లి పరిధిలోని గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారింది. శనివారం ఒక్కరోజే మూడు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పెనుబల్లి మండలం చింతగూడెం ఎగ్జిట్ పాయింట్ వద్ద కారు రైలింగ్‌‌‌‌‌‌‌‌ను ఢీకొని బోల్తా పడిన ఘటనలో ఖమ్మంకు చెందిన డ్రైవర్ నాగారపు నాగేశ్వరరావు (45), కొల్లి ఉషారాణి (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు మహిళలు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

బంధువుల పెళ్లి కోసం షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే రోజు ఉదయం చింతలపూడి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందాడు. మధ్యాహ్నం వైరా వద్ద బియ్యం లోడ్‌‌‌‌‌‌‌‌తో వెళ్తున్న లారీ రైలింగ్‌‌‌‌‌‌‌‌ను ఢీకొని నదిలో పడగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. హైవేపై గరిష్ట వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు ఉన్నప్పటికీ, కొందరు వాహనదారులు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.