ఖమ్మం టౌన్/ భద్రాచలం/ నర్సంపేట/ తొర్రూరు, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఖమ్మం న్యాయ సేవా సదన్‌లో కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ పడదగిన కేసుల్లో ఇరుపక్షాలు అంగీకారంతో పరిష్కరించుకుని సత్వర న్యాయం పొందాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో 15 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం సీపీ సునీల్ దత్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి దేవీ మానస, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, జడ్జి శివనాయక్, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దుర్గాభవానీ మాట్లాడుతూ సఖ్యతతో వివాదాలను పరిష్కరించుకోవచ్చన్నారు. భద్రాచలంలో పలు కేసుల పరిష్కారం ద్వారా జరిమానాలు, బ్యాంకు కేసుల్లో కలిపి భారీగా నగదు వసూలైనట్లు ఆఫీసర్లు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో సీనియర్ సివిల్ జడ్జి, తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ప్రతీక్ సిహాగ్ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జడ్జి ధీరజ్ కుమార్ మాట్లాడుతూ 1,956 కేసులకు సంబంధించి రూ.23,73,236 జరిమానా విధించినట్లు తెలిపారు.
