ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం..ఫీజు బకాయిలపై విద్యార్థి నేతల ఆందోళన

ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం..ఫీజు బకాయిలపై విద్యార్థి నేతల ఆందోళన
  • రికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. తోపులాట 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌మెంట్, స్కాలర్‌‌షిప్‌‌ల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. శాసనసభ పరిసరాలు పోలీసుల మోహరింపులు, విద్యార్థుల నినాదాలు, తోపులాటలతో ఒక్కసారిగా రణరంగంగా మారాయి. అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందుగానే పలువురు విద్యార్థి నేతలను అరెస్టులు చేశారు. అయినా, వందలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని బారికేడ్లతో అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తీవ్రస్థాయి తోపులాట జరిగింది.

పోలీసులు బలవంతంగా ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు జీవన్ మాట్లాడుతూ..పెండింగ్ లోని ఫీజు బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బకాయిలను రిలీజ్ చేయకపోయకపోవడంతో ఆయనకు  కట్టేందుకు చీరను తెచ్చామని చెప్పారు. కాగా, ఏబీవీపీ నేత రాకేశ్ ఒక్కసారిగా శ్వాస అందక స్పృహతప్పి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనకు సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించారు.