- ఈవోకు, ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసిన అర్చకులు, రిటైర్డ్ అర్చకులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల తీరుపై అర్చకులు, రిటైర్డ్ అర్చకులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు శనివారం ఈవో దామోదర్రావుకు వినతిపత్రం అందజేయగా, రిటైర్డ్ అర్చకులు ప్రభుత్వానికి ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందజేశారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లుగా వారు పేర్కొంటున్నారు. ఆలయాలను తప్పనిసరిగా భూ స్పర్శతోనే నిర్మించాలని ఆగమశాస్త్రం చెబుతోందంటున్నారు. ఆలయాలు నిర్మించేటప్పుడు కొండకు ఆనుకుని చేసే నిర్మాణాలకు భూమి నుంచి కొండతో సమానంగా మట్టి, రాళ్లతోనింపడం శాస్త్రోక్త పద్ధతి అని పేర్కొంటున్నారు. భద్రాద్రి ఆలయంలో ప్రస్తుతం తూర్పు, పడమర, ఉత్తరం దిక్కుల్లో కట్టడాలకు భూస్పర్శ ఉందని గుర్తు చేశారు.
ఆలయ విస్తరణలో భాగంగా దక్షిణం వైపున వరాహ, హయగ్రీవ, వేంకటేశ్వరస్వామి వంటి మొదలైన ఉపాలయాలను భూ స్పర్శ లేకుండా కడుతున్నారని అభ్యంతరం తెలిపారు. కొండ బయటి భాగంలో కింద నుంచి రిటైనింగ్ వాల్వంటిది నిర్మించి దానిపై ఆలయ నిర్మాణాన్ని భూ స్పర్శ లేకుండా నిర్మించడం ఆగమశాస్త్రానికి విరుద్ధమని చెబుతున్నారు. మొదటి ప్రాకారంలో కచ్చితంగా మట్టితో నింపి భూస్థాయిని సమం చేస్తే నాలుగు వైపులా భూ స్పర్శ కొనసాగుతుందంటున్నారు. వాస్తు ప్రకారం కూడా దక్షిణం ఖాళీగా ఉంచి ఉత్తరం పూరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉత్తరం వైపు చేసినట్లుగానే దక్షిణ భాగంలో కూడా నిర్మాణం చేయాలని సూచిస్తున్నారు. భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ప్రాచీన నిర్మాణ వైభవం, ఆగమపరంపర, భూ స్పర్శ, శాశ్వతత్త్వం కాపాడాలని కోరుతున్నారు.
