ప్రధాని మోడీ విందుకు జిన్ పింగ్ డుమ్మా.. హాటల్‎లోనే చైనా అధ్యక్షుడు రెస్ట్..!

ప్రధాని మోడీ విందుకు జిన్ పింగ్ డుమ్మా.. హాటల్‎లోనే చైనా అధ్యక్షుడు రెస్ట్..!

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశ తొలి రోజు (సెప్టెంబర్ 12) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బ్రిక్స్ సదస్సుకు హాజరైన విదేశీ ప్రముఖులకు ప్రధాని మోడీ ఇచ్చిన విందు కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి బ్రిక్స్ కూటమిలోని ఇతర నాయకులు హాజరైనప్పటికీ చైనా అధ్యక్షుడు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. డిన్నర్ కార్యక్రమానికి జిన్ పింగ్ దూరంగా ఉండటానికి గల స్పష్టమైన కారణం ఏంటో తెలియలేదు. అయితే, విందు కార్యక్రమాన్ని స్కిప్ చేసిన ఆయన హోటల్‏లోనే రెస్ట్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

2026, సెప్టెంబర్ 12, 13 తేదీలలో బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సమావేశానికి ఇండియా ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోన్న ఈ సమావేశానికి 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా హాజరయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్‏పింగ్ వంటి ప్రముఖ నేతలు ఈ సదస్సుకు అటెండ్ అయ్యారు. శనివారం (సెప్టెంబర్ 12) బ్రిక్స్ సమావేశాల తొలిరోజు కూటమిలోని సభ్యదేశాలన్ని ఏకాభిప్రాయంతో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్'ను ఆమోదించాయి. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) సంస్కరణలు, ఉగ్రవాదంపై రాజీలేని పోరు, రక్షణాత్మక వాణిజ్య విధానాలకు స్వస్తి పలకడమే లక్ష్యంగా విడుదల చేసిన ఈ తీర్మాన పత్రంలోని వివరాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సహా సభ్యదేశాల అధినేతల సమక్షంలో జరిగిన ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాల గళాన్ని కూటమి బలంగా వినిపించింది. 

విభేదాలు పక్కన పెట్టి ఇరాన్ సహా యూఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్‎కు ఆమోదం తెలిపాయి. అలాగే, అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్ ఆధిపత్య ప్రభావాన్ని తగ్గించే దిశగా బ్రిక్స్ దేశాలు కీలక అడుగు వేశాయి. కూటమి దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లోకల్ కరెన్సీల్లో నిర్వహించేలా ప్రోత్సహించాలని తీర్మానించాయి. దేశాల మధ్య ఆర్థిక సహకారం, స్టార్టప్స్ కోసం కొత్త నెట్వర్క్లీను సృష్టించాలని నిర్ణయించాయి.

 సులభతర వాణిజ్యం కోసం క్రాస్ బార్డర్ చెల్లింపుల వ్యవస్థల అనుసంధానంపై అధ్యయనం చేయాలని తీర్మానించాయి. బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ ద్వారా సభ్య దేశాల బ్యాంకింగ్, మెసేజింగ్ నెట్వర్క్లు పరస్పరం కలిసి పనిచేసేలా ఏర్పాట్లను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా అంతర్జాతీయ వేదికల్లో సమూల మార్పులు రావాల్సిందేనని కూటమి కుండబద్ధలు కొట్టింది. 

ఈ సమావేశం అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, ప్రధాని మోడీ భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం, సరిహద్దు వివాదం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం శనివారం (సెప్టెంబర్ 12) రాత్రి బ్రిక్స్ సదస్సుకు హాజరైన నాయకులు, ఇతర భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థల కోసం ప్రధాని మోడీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు డుమ్మా కొట్టారు. హోటల్‎లోనే ఆయన విశ్రాంతి తీసుకున్నారు. 

ఆయన గైర్హాజరీకి గల కారణమేంటో తెలియలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర బ్రిక్స్ నాయకులు ఈ విందుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తదితరులు ఈ విందులో పాల్గొన్నారు.