న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు భారీ డిఫెన్స్ ‘ఆఫర్ల’తో వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలపై ప్రతిపాదనలు పెట్టారు. ఐదో తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేసేందుకు రష్యా సిద్ధమైంది. సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలను ఆధునికీకరించే ‘సూపర్ సుఖోయ్’ ప్రాజెక్టుతోపాటు ఎస్-400, ఎస్-500 రక్షణ వ్యవస్థలను కూడా అందించేందుకు ప్రతిపాదించింది. సుఖోయ్ 57 విషయంలో రష్యా భారీ ప్యాకేజీని ముందుకు తెచ్చింది.
కొన్ని విమానాలను నేరుగా భారత్‌కు అందించడంతోపాటు మరికొన్నింటిని దేశంలోనే సంయుక్తంగా తయారుచేయాలని ప్రతిపాదించింది. విమానాల తయారీలో కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ మాత్రం సాంకేతిక పరిజ్ఞాన బదిలీ పూర్తిస్థాయిలో ఉండాలని కోరుతోంది. విమానాలతోపాటు ఆధునిక ఆయుధాలు, క్షిపణులు కూడా అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం భారత వాయుసేనలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గుతోంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న అధునాతన మధ్యస్థ యుద్ధ విమానం అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది. దీంతో మధ్యంతర అవసరాల కోసం సుఖోయ్ 57ను పరిశీలిస్తోంది.
తొలి దశలో 84 ఫైటర్ జెట్లు
సుఖోయ్30ఎంకేఐ విమానాల సామర్థ్యాన్ని పెంచేందుకు ‘సూపర్ సుఖోయ్’ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు విలువ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉండనుంది. తొలిదశలో 84 విమానాలను ఆధునికీకరించనున్నారు. కొత్త రాడార్లు, ఆధునిక ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, కొత్త ఇంజిన్లను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 300 దీర్ఘశ్రేణి ఆర్-37ఎం క్షిపణుల అంశం కూడా చర్చలో ఉంది.
మరోవైపు, అదనంగా ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం భారత్‌లోనే కేంద్రాన్ని ఏర్పాటుకు రష్యా సిద్ధంగా ఉంది. ఎస్-500 గగనతల రక్షణ వ్యవస్థను కూడా ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు పాంట్సిర్-ఎస్1ఎం రక్షణ వ్యవస్థలు, అధునాతన రాడార్లు, జలాంతర్గాములను విక్రయించే ప్రతిపాదనలు కూడా రష్యా జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఆయుధాలు అమ్మడమే కాకుండా.. భారత్‌లోనే తయారీ, సాంకేతిక సహకారాన్ని పెంచుకోవడంపై రష్యా దృష్టి పెట్టింది.
