న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏడేండ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న ఆయన దేశ రాజధానిలో 24 గంటల పాటు ఉంటారు. ఈ పర్యటన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించింది. జిన్‌పింగ్ రాకకోసం చైనా ముందస్తుగా పక్కా వ్యూహం అమలుచేసింది.
ఆయన ప్రయాణించే ‘హోంగ్కీ’ స్టేట్ లీమోసిన్ కారుతో పాటు మరో బ్యాకప్ వెహికల్, కమ్యూనికేషన్ పరికరాలను పది రోజుల ముందే ప్రత్యేక కార్గో విమానంలో భారత్‌కు పంపింది. ఇక, జిన్‌పింగ్ ప్రయాణించిన ఎయిర్ చైనా బోయింగ్ 747-8 విమానం ఒక మొబైల్ కమాండ్ సెంటర్‌లా పనిచేయడమే కాకుండా.. ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, క్షిపణి రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది.
తాజ్ ప్యాలెస్ వద్ద మూడంచెల భద్రత
జిన్ పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్ హోటల్ చుట్టుపక్కల ప్రాంతాన్ని అధికారులు నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. హోటల్ పరిసరాల్లో యాంటీ టర్రర్, బాంబ్ డిటెక్షన్ టీమ్‌లను రంగంలోకి దించారు. అణు, రేడియేషన్, బయోకెమికల్ ముప్పులను గుర్తించే అత్యాధునిక పరికరాలతో భూగర్భ పైప్‌లైన్లను తనిఖీ చేశారు. విదేశీ భద్రతా బృందాలు తీసుకొచ్చిన శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలకు భారత నిబంధనల ప్రకారం అనుమతి నిరాకరించినట్లు తెలిపారు.
