- లింకులు ఓపెన్ చేయొద్దు.. టీజీ సీఎస్‌బీ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: ‘1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్’ ట్రెండ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌బీ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెట్రో ఫొటో ఎడిటింగ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ శనివారం ప్రకటన విడుదల చేశారు.
సాధారణ ఫొటోలను 1980 నాటి రెట్రో పిక్స్‌గా మారుస్తామని ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా సైబర్ మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేసేలా, ధృవీకరించని మూలాల నుంచి ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్) ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకునేలా వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
రెట్రో ఫొటో-ఎడిటింగ్ అప్లికేషన్‌లకు ఉచితంగా లేదా అపరిమితంగా యాక్సెస్ ఇస్తామని సోషల్‌మీడియాలో మోసగాళ్లు లింకులు ప్రచారం చేస్తారు. వాటిపై క్లిక్ చేయడం ద్వారా, బాధితులు అధికారిక యాప్ స్టోర్‌ల వెలుపల ఉన్న ఒక హానికరమైన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకునేలా చేస్తున్నారు.
ఆ తర్వాత హ్యాకింగ్‌కు అవసరమైన అనుమతులను కోరుతున్నారు. ఇలా మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసి ఎస్‌ఎమ్ఎస్‌లు, ఓటీపీలు, మొబైల్ కాంటాక్ట్‌లు, ఇతర వ్యక్తిగత సమాచారం సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
