- పూర్తయిన డీపీఆర్, ఫైనల్ లొకేషన్ సర్వే
- నాలుగు రాష్ట్రాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ
కోల్‌బెల్ట్, వెలుగు: ఉత్తరాది రాష్ట్రాలను దక్షిణాదితో అనుసంధానించే చైన్నై–-న్యూఢిల్లీ రూట్లోని కాజీపేట–-బల్లార్షా మధ్య నాలుగో రైల్వే లైన్ నిర్మించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3,500 కోట్ల అంచనాతో నాలుగో లైన్‌ను మంజూరు చేసింది. కాజీపేట–-బల్లార్షా మార్గంలో 250 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్న ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి డీటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్( డీపీఆర్) సైతం పూర్తయింది.
మూడో రైల్వే లైన్ పూర్తయిన నేపథ్యంలో..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–-బల్లార్షా రైల్వే మార్గంలో ఇటీవల నిర్మించిన మూడో రైల్వే లైన్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. 2015–16 బడ్జెట్లో 203 కిలోమీటర్ల మూడో లైన్ పనులకు ఆమోదం లభించింది. రూ.3వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ జులై నెలలో పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఈక్రమంలో కాజీపేట–-బల్లార్షా రూట్లో నాలుగో లైన్ నిర్మాణంపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. 250 కిలోమీటర్ల పొడవున నాలుగో రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో 80శాతం తెలంగాణలో ఉండగా, మిగిలిన భాగం మహారాష్ట్రలో ఉంది. నాలుగో రైల్వే లైన్‌కు సంబంధించి ఫైనల్ లోకేషన్ సర్వే(ఎఫ్ఎల్ఎస్) కూడా ఇటీవల పూర్తయింది. మొదటి సర్వేను పూర్తి చేయగా, ఈ నెల 9,10 తేదీల్లో రెండో సర్వే కూడా చేశారు. దీనిపై ఈనెల 15న నివేదిక అందించనున్నారు. ఇందులోని అంశాల ఆధారంగా సాధ్యాసాధ్యాలపై చర్చించి వచ్చే రైల్వే బడ్జెట్లో ప్రకటించేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రద్దీ నియంత్రణకు చెక్
కాజీపేట–-బల్లార్షా రైల్వే మార్గంలో ఇప్పటికే మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా నాలుగో రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుండగా, ఈ ప్రాజెక్టుతో కాజీపేట–--బల్లార్షా మధ్య రైళ్ల వేగం పెరగడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ రూట్లో ప్రయాణించే రైళ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సౌత్ సెంట్రల్ రెల్వే నెట్‌వర్క్‌లో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. గ్రాండ్ ట్రంక్ రూట్లో కాజీపేట–--బల్లార్షా మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రయాణికులను చేరవేసే రైళ్లు, గూడ్స్ రాకపోకలతో ఈ మార్గం నిత్యం బిజీగా ఉంటుంది. కీలక రైలు రవాణా మార్గాల్లో ఇది ఒకటి. నాలుగో లైన్ పూర్తయితే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక ట్రాక్ అందుబాటులోకి వస్తుంది. దీంతో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, పాట్నా, లఖ్‌నవూ, అలహాబాద్ వంటి నగరాలకు రైలు ప్రయాణం వేగవంతమవుతుంది. సికింద్రాబాద్(ఘట్కేసర్)-–కాజీపేట మధ్య ఇటీవల కేంద్రకేబినెట్ ఆమోదించిన 110 కిలోమీటర్ల నాలుగో లైన్ ప్రాజెక్టుతో కాజీపేట–-బల్లార్షా నాలుగో లైన్‌ను అనుసంధించే అవకాశం ఉంది. దీంతో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వైపు నిరంతరాయంగా రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి.
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడం, ఎన్టీపీసీ, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ముడి సరుకు రవాణాతో గూడ్స్ రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నాలుగో లైన్ పూర్తయితే గూడ్స్, ప్యాసింజర్‌రైళ్లు ఒకదాని కోసం ఒకటి ఆగాల్సిన అవసరం లేకుండా పోతుంది. రద్దీ నియంత్రణ ద్వారా సమయపాలన మెరుగవుతుంది. ఇప్పటికే కాజీపేట–విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఇది మరో రెండేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. కాజీపేట–-బల్లార్షా మధ్య మరో లైను నిర్మిస్తే దేశంలో అతిపెద్ద నాలుగో లైన్ కలిగిన రైల్వే మార్గంగా మారనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య రవాణా పెరుగుతుంది.
